నవతెలంగాణ - హైదరాబాద్:
ప్రముఖ కవయిత్రి, రచయిత వనజ బలుసానిని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ నెల 20, 21 తేదీలలో నిర్వహించిన తెలంగాణ బాలోత్సవం ఆరవ పిల్లల జాతరలో వివిధ పోటీ కార్యక్రమాలలో ఆమె జడ్జిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వనజ బలుసాని మాట్లాడుతూ.. బాలోత్సవం ఆరవ పిల్లల జాతరలో జడ్జిగా పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు.
వివిధ పోటీలలో పిల్లలు ప్రదర్శించిన ప్రతిభ, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడం ఎంతో గొప్ప విషయమని, ఇలాంటి వేదికలు బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.
ఈ సత్కారం తనకు మరింత బాధ్యతను, స్ఫూర్తిని అందించిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులకు, బాలోత్సవం ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి కే. రమణాచారి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.






కామెంట్లు (0)