ఉద్యోగం సాధించాడన్న ఆనందం ఆవిరి.. వారం రోజులకే విషాదం
జింకను ఢీకొని ఆగిన కారును వెనుక నుంచి ఢీకొన్న వాహనాలు..
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయితేజ మృతి..
కుటుంబానికి ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ప్రగాఢ సానుభూతి
నవతెలంగాణ-మునుగోడు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ఎంతో కష్టపడి చదువుకుని ఇటీవలే ఉద్యోగం సాధించిన ఆ యువకుడి జీవితంలో విధి విషాదాన్ని నింపింది. ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కుటుంబంలో ఇంకా ఆరిపోకముందే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మునుగోడు మండల కేంద్రానికి చెందిన వీరమళ్ల సాయితేజ (25) మృతి చెందడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళితే.. మునుగోడు పట్టణానికి చెందిన వీరమళ్ల సాయితేజ ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో గత వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో సంతోషంలో మునిగిపోయారు. ఇంతలోనే ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచింది.అమెరికాలోని న్యూయార్క్లో సాయితేజ కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో అకస్మాత్తుగా జింక అడ్డురావడంతో దానిని ఢీకొని కారు నిలిచిపోయింది.
అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కార్లు ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొనడంతో సాయితేజ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడుతున్నాడని ఆశించిన తల్లిదండ్రులకు కుమారుడి మరణవార్త పిడుగులాంటి దెబ్బగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇక లేడన్న వార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటనతో మునుగోడులో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ప్రగాఢ సంతాపం: మునుగోడు యువకుడు వీరమళ్ల సాయితేజ అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం అత్యంత బాధాకరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎదుగుతున్న వయసులో, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్న యువకుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించి తన కలలను సాకారం చేసుకుంటున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కలచివేసిందన్నారు. సాయితేజ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు .







కామెంట్లు (0)