- సర్పంచ్, ఉపసర్పంచ్ పరస్పర ఫిర్యాదులు
- పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణకు డిమాండ్
- చెక్ పవర్ రద్దు చేసి ప్రత్యేక అధికారి పాలన అమలు చేయాలని సర్పంచ్ లక్ష్మి కుమారి వినతి
- సర్పంచ్ భర్త పెత్తనంపై ఉపసర్పంచ్ సాధు జోసెఫ్ కులకర్ణి ఫిర్యాదు
నవతెలంగాణ - అశ్వారావుపేట : మండలంలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. పంచాయతీ అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, పరిపాలనలో జోక్యంపై ఇమండలంలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. పంచాయతీ అభివృద్ధిరువురు ఒకరిపై ఒకరు మండల పంచాయతీ అధికారికి ఫిర్యాదులు చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి విచారణ జరపాలని సర్పంచ్ సత్యం లక్ష్మికుమారి కోరారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవోకు రాసిన వినతిపత్రాన్ని ఎంపీఈఓ రామకోటిరెడ్డికి అందజేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలితే పంచాయతీరాజ్ చట్ట ప్రకారం తనపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, పంచాయతీ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల డ్రాకు ఉపసర్పంచ్ సహకరించడం లేదని, చెక్కులపై సంతకాలు చేయడానికి కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ అభివృద్ధి కుంటుపడుతోందని, సర్పంచ్, ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దుచేసి అధికారులకు అప్పగించాలని, ప్రత్యేక అధికారి పాలన అమలు చేయాలని కోరారు.
ఇదిలా ఉండగా, ఉపసర్పంచ్ సాధు జోసెఫ్ కులకర్ణి సైతం సర్పంచ్ భర్త సత్యం రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. సర్పంచ్ భర్త పంచాయతీ పాలనలో జోక్యం చేసుకుంటూ, సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు తెలియకుండా వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. తిమ్మాపురంలో పాత మోటారు స్థానంలో కొత్త మోటారు ఏర్పాటు పనులకు సంబంధించి ఒక నోట్‌ఫైల్‌లో రూ.17,850 ఖర్చు చూపించగా, అదే పనికి సంబంధించి మరో నోట్‌ఫైల్‌లో రూ.1,13,408 బిల్లుతో నిధులు డ్రా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఖర్చుల వివరాల్లో పొంతన లేదని, తాను అభ్యంతరం చెప్పడంతో రూ.17,850 డ్రా కాలేదని తన ఫిర్యాదులో వివరించారు.
అలాగే ఇందిరమ్మ ఇళ్ల దీపావళి కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సర్పంచ్, ఆమె భర్త ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని, గ్రామసభల్లోనూ సర్పంచ్ భర్త వేదికపై కూర్చుంటూ పరిపాలనలో పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఫిర్యాదుతో సమర్పించినట్లు తెలిపారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒకే పంచాయతీలో ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వహించాల్సిన సర్పంచ్, ఉపసర్పంచ్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ అధికారులకు ఫిర్యాదులు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటో అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.







కామెంట్లు (0)