•సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నవతెలంగాణ-మర్రిగూడ
మిషన్ భగీరథ స్కీం లో పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆ సంఘం మండల అధ్యక్షులు గ్యార కాశయ్య అధ్యక్షతన జరిగిన మిషన్ భగీరథ కార్మికుల నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
మిషన్ భగీరథ కార్మికులు చాలీచాలని వేతనాలతో వెట్టి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కు అనుగుణంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, అటెండెన్స్ స్కానింగ్ సిస్టం ఎత్తివేయాలని, ఆపిన బోనస్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 1 నుండి 3 వరకు జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మిషన్ భగీరథ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలే శివ,జీడిమెట్ల నరసింహ, జాజుల రవి, గ్యార యాదయ్య, సుంకరి యాదయ్య, వరికుప్పల శ్రీహరి, పూల శివ, పాలకూరల యాదయ్య, చివర్ల యాదయ్య,నకిరేకటి భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)