నవతెలంగాణ - అశ్వారావుపేట : ముసురు తుఫాను ప్రభావంతో అశ్వారావుపేటలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రోడ్ల వెంట ఉన్న డ్రైనేజీలు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో 365 బీబీ ఖమ్మం - దేవరపల్లి జాతీయ రహదారిపై అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం సమీపంలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. రహదారికి ఇరువైపులా ఎగువ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలు, ఉద్యాన నర్సరీలు ఉండటంతో పాటు రహదారి దిగువన ఉండడం, సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో హైవేపై వరద ప్రవాహం ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు.






కామెంట్‌లు (0)