గంగారం గిరిజన సొసైటీ భూముల వద్ద హైడ్రామా

30 నిమిషాల క్రితం

Hydrarama
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 28, 2026 | 2 నిమిషాల చదవడం

- 12 ఎకరాల స్వాధీనంతో ఉద్రిక్తత

- సర్వే నంబర్ 40లో 20 ఎకరాల అదనపు ప్రభుత్వ భూమిగా తేల్చిన రీ-సర్వే

- ​కొమురం భీం కాలనీ 8 ఎకరాలు మినహాయించి, మిగిలిన 12 ఎకరాలకు ఫెన్సింగ్

- ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 17 మంది ఎస్సైలు, 250 మంది పోలీస్ బలగాలు

- పోలీసు భారీ బందోబస్తు నడుమ రెవెన్యూ  అధికారుల చర్యలు

- అడ్డుకున్న గిరిజనుల అరెస్ట్‌లు

- ​128 ఎకరాల గిరిజన భూముల జోలికి పోలేదన్న తహసీల్దార్ రవికుమార్

నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి మండలం గంగారంలోని ట్రైబల్ జాయింట్ ఫార్మింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ భూముల వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

1971–72లో 445/బీఈ రిజిస్ట్రేషన్ నంబరుతో ఏర్పాటైన ఈ సొసైటీకి ప్రభుత్వం అప్పట్లో 120 ఎకరాల భూమిని కేటాయించింది.

అయితే గత ఫిబ్రవరి 12న ఆర్డీవో ఆధ్వర్యంలో బేతుపల్లి పరిధిలోని సర్వే నంబర్ 40లో భూ రీ-సర్వే నిర్వహించారు.ఈ రీ-సర్వేలో సొసైటీ ఆధీనంలో మొత్తం 140 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేటాయించిన దానికంటే అదనంగా 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.


అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 17 మంది ఎస్సైలు, 250 మంది పోలీసు బలగాలతో...

ఈ అదనపు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ శాఖ ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు 17 మంది ఎస్సైలు, 250 మంది పోలీసు బలగాలతో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ నేతృత్వంలో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు భారీ ఆపరేషన్ చేపట్టింది. అదనంగా తేలిన 20 ఎకరాల్లో ఇప్పటికే కొమురం భీం గిరిజన కాలనీ ఉన్న 8 ఎకరాలను మినహాయించారు.

మిగిలిన 12 ఎకరాల భూమికి ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు చేసేందుకు అధికారులు ఉపక్రమించారు.

ప్రభుత్వ అవసరాలకు భూములు ఇవ్వబోమంటూ గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ అధికారులకు, గిరిజనులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.


ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆందోళనకారుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 12 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ పనులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి తహసీల్దార్ రవికుమార్ మీడియాతో మాట్లాడారు.

సర్వే నంబర్ 40లోని మొత్తం 140 ఎకరాల భూమిలో సొసైటీకి చెందిన 120 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. వీటికి తోడు కొమురం భీం కాలనీకి చెందిన 8 ఎకరాలను కూడా కలిపి చెప్పారు. మొత్తం 128 ఎకరాల గిరిజన భూమిని తాము ముట్టుకోలేదని స్పష్టం చేశారు.


కేవలం రీ-సర్వేలో అదనంగా తేలిన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రమే స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ భూమి రక్షణ నిమిత్తమే ఫెన్సింగ్ వేశామని తహసీల్దార్ వివరించారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. ఎవరైనా పిటిషన్లు వేస్తే తాము కూడా చట్టపరంగా కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. మరోవైపు, సొసైటీ భూములను కౌలుకు తీసుకోవడం చట్టరీత్యా నేరమనే విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు కౌలుదారులు నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 40 ఏళ్లుగా ఈ భూముల్లో తిష్ట వేశారు.


సొసైటీ సభ్యులకు తెలియకుండానే ఈ అదనపు 20 ఎకరాలు కూడా కౌలుదారుల చేతుల్లోకి వెళ్లాయి. దశాబ్దాల పాటు ఆ అదనపు భూములు కౌలుదారుల ఆధీనంలోనే సాగవుతూ రావడం గమనార్హం. ప్రస్తుతం కౌలుదారుల కబంధహస్తాల నుంచి ఈ గిరిజన భూములకు ఏడాది క్రితం విముక్తి లభించింది. ఇప్పుడు ప్రభుత్వ భూమి స్వాధీనం, ఫెన్సింగ్ ఏర్పాటు, ఉద్రిక్తత చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్