నవతెలంగాణ - మల్హర్ రావు
తెల్ల రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపిడిఓ క్రాంతి కుమార్, సర్పంచ్లు బండి స్వామి, జంగిడి శ్రీనివాస్, మేకల రాజయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తాడిచెర్ల, ఎడ్లపల్లి, మల్లారం గ్రామాల్లో శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు బీమా నమోదు రసీదులను పంపిణీ చేశారు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. సదరు వ్యక్తి సాధారణ మరణం, ప్రమాదం ఏ కారణంతో మరణించినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని వివరించారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథక లక్ష్యమన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, పురుషోత్తం రావు, వార్డు సభ్యులు, జీపీల కార్యదర్శులు మల్లిఖార్జున రెడ్డి, భాస్కర్ రెడ్డి, సాయి చరణ్, ప్రజలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)