- గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
- పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ - అశ్వారావుపేట
గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం ఎంతో కీలకమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారులకు చిన్ననాటి నుంచే సమతుల్య, పౌష్టికాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు, ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా పోషణ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అనంతరం వివిధ రకాల పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఎమ్మెల్యే పరిశీలించారు. చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను అంగన్వాడీ సిబ్బంది వివరించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల బరువు, ఎదుగుదలను పర్యవేక్షించడంతో పాటు గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






కామెంట్లు (0)