Magazines

ఈసీఐ స్వతంత్రతను కాపాడాలి

30 సెప్టెంబర్, 2026

CPIM, EC
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం

- సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

- సత్తుపల్లిలో సీపీఐ(ఎం) నిరసన ప్రదర్శన 

నవతెలంగాణ-సత్తుపల్లి 

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పాత సెంటర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ​ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందని సీపీఐ(ఎం) నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం నడుచుకోవాలన్నారు.

ప్రస్తుత పరిణామాలు, ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ​సీఈసీ జ్ఞానేష్ కుమార్ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆయన ఆ పదవిలో కొనసాగడం ఏమాత్రం తగదని స్పష్టం చేశారు. ​ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీల పట్ల సమాన దూరం పాటిస్తూ, నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ​ముఖ్యంగా ఓటర్ల జాబితాల సవరణ, ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించి వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, వివాదాలపై తక్షణమే సమగ్ర సమీక్ష నిర్వహించి ఓటర్ల హక్కులను పరిరక్షించాలని కోరారు.

​ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్‌లో ఎస్ఐఆర్-2026కు సంబంధించిన ఓటర్ల సేవలు అందుబాటులో ఉన్న తరుణంలో నిర్ణయాలను స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. ఈసీ స్వతంత్రతను పరిరక్షించాలన్నారు. సీఈసీ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, నాయకులు రావుల రాజబాబు, శీలం కరుణ, చావా రమేష్, చప్పిడి భాస్కర్, ఎస్‌కే వలి, సైదా, ఎస్‌కే బాషా, వెంకటేశ్వరరావు, జిలాని, రఫీ, నబీ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్