Magazines

టీజీ టీటీఎఫ్‌ మండల నూతన కమిటీ ఎన్నిక

08 అక్టోబర్, 2026

TG TTF
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 2 నిమిషాల చదవడం

- ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

- రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్‌ లక్ష్మణ్‌ నాయక్‌

నవతెలంగాణ - అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ట్రైబల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీజీ టీటీఎఫ్‌) అశ్వారావుపేట మండల నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హలావత్‌ హరిబాబు, జిల్లా అధ్యక్షులు వి. రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీని అభినందించారు.


ఈ సందర్భంగా లక్ష్మణ్‌ నాయక్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్‌ 3 స్థానంలో కొత్త జీవో తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలని, రెండో పీఆర్సీలో 51 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని కోరారు. పీఆర్సీలో ఏజెన్సీ అలవెన్స్‌, 10 శాతం హెచ్‌ఆర్‌ఏ, ఎస్సీఏను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.


సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పండిట్‌, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి పదోన్నతులు కల్పించాలని కోరారు. సీఆర్టీలను రెగ్యులరైజ్‌ చేయడంతో పాటు ఎంఐఎస్‌, సీసీఓ, సీఆర్పీ, కేజీబీవీ సీఆర్టీలను కూడా క్రమబద్ధీకరించాలని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, గిరిజన జనాభా ప్రాతిపదికన జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం టీజీ టీటీఎఫ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని లక్ష్మణ్‌ నాయక్‌ స్పష్టం చేశారు.

అశ్వారావుపేట మండల నూతన కార్యవర్గం

గౌరవ అధ్యక్షులుగా బి. నరసింహరావు, అధ్యక్షులుగా జర్పుల జగ్యా, ప్రధాన కార్యదర్శిగా లాకవత్‌ శంకర్‌, మహిళా ఉపాధ్యక్షురాలిగా బి. మంగమ్మ, కోశాధికారిగా బి. నాగేశ్వరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కె. గంగాధర్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి. బాలాజీ, ఎల్‌. సక్రాం, జె. శివ, జె. వెంకట్‌, కార్యదర్శులుగా బి. వీర్యా కుమార్‌, బి. కాంతి, బి. నరసింహ, బి. భాస్కర్‌, సంయుక్త కార్యదర్శిగా బి. హరి కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా కమిటీలోనూ నియామకాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా జె. ప్రేమ్‌సింగ్‌ (ఐటీడీఏ కన్వీనర్‌), టి. కాంతారావు, జిల్లా కార్యదర్శిగా గుగులోత్‌ లక్ష్మణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల, జిల్లా కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్‌ లక్ష్మణ్‌ నాయక్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారు బి. శంకర్‌, రాష్ట్ర కోశాధికారి సిద్ధూ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుగులోత్‌ బన్సీలాల్‌, రవికుమార్‌, శ్రీనివాస్‌, ఆంగోత్‌ నాగప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్