- పరిచయమే రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులకు శాపమైంది
- అప్పు పేరుతో నమ్మించి, ఉన్నదంతా ఉడ్చేశారు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలో అప్పు పేరుతో జరిగిన రూ. 81.50 లక్షల భారీ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వేంసూరు మండలం అడర్లసపాడు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చింతమాల వెంకటేశ్వర్లు, ప్రస్తుతం సత్తుపల్లి వేంసూరు రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సూరవర్జుల చంద్రశేఖర్, స్వప్న దంపతులతో రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులకు పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న చంద్రశేఖర్ దంపతులు వివిధ అవసరాల నిమిత్తం అప్పు కావాలంటూ నమ్మబలికారు. పథకం ప్రకారం ఆ దంపతులు 2025 నవంబర్ 20 నుంచి 2026 ఫిబ్రవరి 22 వరకు పలు దఫాలుగా బాధితుడి నుంచి మొత్తం రూ. 81,50,000 అప్పుగా తీసుకున్నారు. ఆ తర్వాత ఆ డబ్బును తిరిగి చెల్లించకుండా మొహం చాటేయడమే కాకుండా, అపార్ట్‌మెంట్‌లో పోర్షన్ ఖాళీ చేసి కాకర్లపల్లి రోడ్డులోని కాకతీయ నగర్‌కు మకాం మార్చారు.
ఈ మోసంపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నగదు లావాదేవీలు కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు ఎలాగోలా నిందితుల కొత్త చిరునామాను పట్టుకుని సోమవారం చంద్రశేఖర్ దంపతులు ఉంటున్న ఇంటికి వెళ్లి డబ్బులు అడిగారు. దీంతో వారు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. డబ్బులు ఇచ్చేది లేదు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దుర్భాషలాడారు.
అంతేకాకుండా కులం పేరుతో దూషించి, రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులపై భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలో తోచని ఆ వృద్ధ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి నిందితుల ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
అయితే, ఇంత భారీ నగదు కొల్లగొట్టిన ఘరానా మోసం వెనుక పట్టణానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉందని బాధితులు ఆరోపించారు. తమ జీవితకాలపు సంపాదన కోల్పోయామని, న్యాయం జరగకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్యే శరణ్యమని రిటైర్డ్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు తక్షణ న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)