- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్
నవతెలంగాణ-సత్తుపల్లి
నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే అఖిలభారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ మహాసభల ప్రచారంలో భాగంగా సోమవారం సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వ్యవసాయ సంక్షోభం, మద్దతు ధరల సాధనపై ఈ మహాసభల్లో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతు ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడానికి, రైతుల హక్కుల సాధనకు ఈ సభలు వేదిక కానున్నాయని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, తోటకూర వెంకట్రావు, దాట్ల రాంబాబు, కొప్పుల చిన్నస్వామి, పరమేష్, రామారావు, యశోద, భాస్కర్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)