•ఎన్నమనేని రవీందర్రావు, రాందాస్ శ్రీనివాస్
నవతెలంగాణ-మర్రిగూడ
దేశస్థాయిలో మునుగోడు ఆత్మగౌరవాణి పెంచిన వ్యక్తి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నమనేని రవీందర్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డిసిసి అధ్యక్షులు పున్న కైలాస్ నేత తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడనీ, ఆయన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కోసమే మాట్లాడడానికి నిన్ను డిసిసి అధ్యక్షుడిగా పెట్టారా లేక పార్టీని బలోపేతం చేయడానికి పెట్టారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేశారని, దాంట్లో రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరని గుర్తు చేశారు. ప్రతిక్షణం ప్రజల కోసం, ప్రతి అడుగు అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనీ, రాజగోపాల్ రెడ్డిని బదనాం చేయడానికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివినట్టుగా డిసిసి తీరు ఉన్నదని వారు విమర్శించారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, జమ్ముల వెంకటేష్ గౌడ్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)