Magazines

శాసనమండలి ఓటరుగా నమోదు  చేసుకోవాలి

2 గంటల క్రితం

Must register
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆలేరు మాజీ జెడ్పీటీసీ, హై కోర్టు న్యాయవాది బొట్ల పరమేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన అన్నారు.


ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. నవంబర్ 1, 2026 నాటికి కనీసం మూడు సంవత్సరాల ముందు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు.


అర్హులైన వారు ఫారం–18ను పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి నవంబర్ 6, 2026లోపు సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ఓటరు నమోదు కోసం దరఖాస్తుదారులు నిర్దిష్ట నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన పత్రాలను సక్రమంగా సమర్పించి, తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు.


ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని బొట్ల పరమేశ్వర్ తెలిపారు. పట్టభద్రులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని, ఓటరు నమోదు ప్రక్రియపై తమకు తెలిసిన ఇతర అర్హులైన పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలను పాటిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్