Magazines

భక్తి మార్గంలో రాజకీయాలకు అతీతంగా ఐక్యత చాటాలి

38 నిమిషాల క్రితం

MLA Rajagopal Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 2 నిమిషాల చదవడం

- అయ్యప్ప ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
- ఆలయ నిర్మాణానికి మరో రూ.10 లక్షల విరాళం ప్రకటన

నవతెలంగాణ–చండూరు : ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దైవసన్నిధిలో ప్రతి ఒక్కరూ సమానులేనని, భక్తికి కులమతాలు, రాజకీయాలకు అతీతమైన స్థానం ఉంటుందని పేర్కొన్నారు. చండూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో సోమవారం ఆయన తన సతీమణి లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఎమ్మెల్యే దంపతులు యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన క్రతువుల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అభివృద్ధికి అండగా విరాళం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ నిర్మాణం కోసం శ్రమిస్తున్న కమిటీ సభ్యులు, భక్తులు, దాతల కృషిని అభినందించారు. ఇప్పటికే తనవంతుగా రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించానని, తాజాగా మరో రూ.10 లక్షలు విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. భగవంతుడు ప్రసాదించిన స్థాయిని బట్టి ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలని కోరారు.

భక్తి భావమే సమాజానికి బలం

దేవుడి ముందు పేద, ధనిక అనే తేడాలు ఉండవని, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా భక్తులంతా ఒక్కటేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. భక్తి మనుషుల మధ్య విభేదాలను తొలగించి ఐక్యతను పెంపొందించాలని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. చండూరులో ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు.

ఆలయ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా పట్టణంలో భక్తి వాతావరణం నెలకొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాద్ వితరణ చేశారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, పట్టణ అధ్యక్షులు ఐతరాజు రాజు మల్లేష్ , మజీ సర్పంచ్ కోడి బాబు, కౌన్సిలర్ కోడి సుష్మా వెంకన్న, వే ద పండితులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్