- ఈ నెల 30న మాప్-అప్ కౌన్సెలింగ్, వాక్-ఇన్ అడ్మిషన్లు
- గతంలో దరఖాస్తు చేసుకోని అర్హులైన విద్యార్థులకూ అవకాశం
- అసోసియేట్ డీన్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్
నవతెలంగాణ - అశ్వారావుపేట
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అశ్వారావుపేట ఉద్యాన కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు చివరి విడత అవకాశం కల్పిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కళాశాలలో మాప్-అప్ కౌన్సెలింగ్, వాక్-ఇన్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇంటర్మీడియట్‌లో బైపీసీ చదివి, TG EAPCET–2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. గతంలో విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకోని అర్హులైన విద్యార్థులు సైతం కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. ప్రతిభ, అర్హత, రిజర్వేషన్ నిబంధనలు, అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
ఇప్పటికే ప్రథమ సంవత్సరం విద్యార్థుల రిజిస్ట్రేషన్, ఓరియంటేషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, నవంబర్ 17 నుంచి తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ కళాశాలలో ఆయిల్‌పామ్, కొబ్బరి, మామిడి, జామ, సపోటా, అరటి, బొప్పాయి, పనస, కోకో, మిరియాలు తదితర ఉద్యాన పంటలను శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రాంగణంలోనే ఉద్యాన పరిశోధనా స్థానం ఉండటంతో విద్యార్థులకు క్షేత్రస్థాయి విద్య, ప్రయోగాత్మక శిక్షణ, పరిశోధనా కార్యకలాపాలపై ప్రత్యక్ష అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహ సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 30న ఉదయం 9 గంటలకు అవసరమైన ఒరిజినల్ ధ్రువపత్రాలు, స్వీయ ధ్రువీకరణ చేసిన జిరాక్స్ ప్రతులతో కళాశాలలో హాజరు కావాలని సూచించారు. ఉద్యాన విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది చివరి అవకాశమని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మరిన్ని వివరాలకు: 8985721365 నంబరులో సంప్రదించాలని డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ సూచించారు.




కామెంట్‌లు (0)