'ముండమోపి పాలన' వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు

8 నిమిషాల క్రితం

Mundamopi rule
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 28, 2026 | 2 నిమిషాల చదవడం

- మహిళలను కించపరిచే వ్యాఖ్యలు తగవు

- మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరిక

నవతెలంగాణ-సత్తుపల్లి 

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇటీవల జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముండమోపి పాలన అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు బాగుమన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు విలేకరులతో మాట్లాడారు. 


మహిళలను కించపరిచే వ్యాఖ్యలు తగవని హితవు పలికారు.‌ మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరికలు కూడా జారీ చేశారు. డీలిమిటేషన్ భయంతోనే మతిస్థిమితం కోల్పోయి మంత్రులపై అసభ్య పదజాలం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను, సభ్య సమాజం తలదించుకునేలా అన్‌పార్లమెంటరీ భాషలో మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. మహిళలు రాజకీయాల్లో, ఉన్నత పదవుల్లో ఉండకూడదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని వారు విమర్శించారు.


​ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం వల్ల వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెల్లవారుజాము వరకు ప్రాణాలకు తెగించి బేతుపల్లి చెరువు వద్ద, డబుల్ బెడ్ రూమ్ నివాసాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా కాపాడారని గుర్తుచేశారు. బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు, పంట నష్టపోయిన రైతులకు వ్యవసాయ అధికారుల ద్వారా నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.


​ఇందిరమ్మ రాజ్యంలో మహిళల పేరుతోనే ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తోందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే మహిళలను, పురుషులను సమానంగా గౌరవించి అందలం ఎక్కించే సంస్కృతి తమదని, స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, సరోజినీ నాయుడు వంటి వీరనారీమణులను సైతం అవమానించేలా ఆయన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


​కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఈ నియోజకవర్గం ఓసీ కేటగిరీలోకి మారుతుందన్న ప్రచారంతో, ఇప్పటివరకు మూడుసార్లు గెలిచిన సదరు ఎమ్మెల్యే భవిష్యత్తులో తన పదవికి ముప్పు వాటిల్లుతుందనే నిరాశతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను, కాంగ్రెస్ మంత్రులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెబుతారని, ఖమ్మం జిల్లాలో తిరగనివ్వకుండా అడ్డుకుంటారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్