నవతెలంగాణ-సత్తుపల్లి
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని, మురసు తుపాను ప్రభావంతో సత్తుపల్లి నియోజకవర్గంలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కోరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంటల రక్షణకు రైతులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.
పోసిన పంటలను వర్షాలకు తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ధాన్యం నిల్వ విషయంలో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాల వేళ ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు, పాత ఇళ్లలో ఉండేవారు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రమాదకర ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.







కామెంట్లు (0)