Magazines

ప్రజా సమస్యలు ప్రస్తావించినందుకే ముందస్తు అరెస్టులా?

15 నిమిషాల క్రితం

Pre-trial arrest
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

రాహుల్ గాంధీ పర్యటనలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అరెస్టు

ఖండించిన యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు జూకంటి అనిల్

నవతెలంగాణ – ఆలేరు రూరల్

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ముందస్తు అరెస్టులు చేయడం ఏమిటని యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు జూకంటి అనిల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని జిల్లా సర్పంచుల పక్షాన తీవ్రంగా ఖండించారు.


ఈ సందర్భంగా జూకంటి అనిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి నిధుల కొరతతో కుంటుపడుతోందని,గతంలో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు బిల్లులు విడుదల కాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు అందక ఇబ్బందులు పడుతుండగా, పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురుచూస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


మరోవైపు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఆందోళన చెందుతున్నారని, హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వెళ్లి నిరుద్యోగుల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామాన్ని సందర్శించి గ్రామీణ ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, మాజీ సర్పంచులు, రైతులు, నిరుద్యోగులు, పెన్షనర్లు, చిన్న కాంట్రాక్టర్లతో నేరుగా మాట్లాడి వారి బాధలను వినాలని రాహుల్ గాంధీని కోరినట్లు యాదయ్య గౌడ్ పేర్కొన్నారని అనిల్ తెలిపారు.

ప్రజల గొంతుక వినిపించడం నేరమా?

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం తప్పా? వారి కష్టాలను జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లడం నేరమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలను వ్యక్తం చేసే హక్కును గౌరవించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్