Magazines

నిలకడ లేని విధానాలతో నెరవేరని ఆయిల్‌ఫామ్ లక్ష్యాలు

21 నిమిషాల క్రితం

AIKS
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 7 నిమిషాల చదవడం

- దిగుమతి ఆధారిత వంటనూనెల ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ఫామ్

- ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం లేక రైతుల్లో సందిగ్ధం

- ఆయిల్‌ఫెడ్‌ను బలోపేతం చేయాలని రైతు సంఘం డిమాండ్

నవతెలంగాణ - అశ్వారావుపేట

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక వంటనూనెలను వినియోగించే దేశాల్లో ఒకటి. సోయాబీన్, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు వంటి పంటల ద్వారా దేశీయంగా వంటనూనెలు ఉత్పత్తి అవుతున్నప్పటికీ, దేశ అవసరాలకు అవి సరిపోవడం లేదు. ఫలితంగా పామాయిల్ దిగుమతుల కోసం ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలపై భారత్ అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు, విదేశీ మారకద్రవ్యం భారీగా వెచ్చించాల్సిన పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయిల్‌పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే, ఒకవైపు భారీ లక్ష్యాలను ప్రకటిస్తూ మరోవైపు విధానాల్లో స్థిరత్వం పాటించకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఆయిల్‌పామ్ సాగు ఆశించిన స్థాయిలో విస్తరించడం లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పేర్కొన్నారు.


వ్యూహాత్మక పంటగా ఆయిల్‌ఫామ్:

ఆయిల్‌పామ్ కేవలం మరో వాణిజ్య పంట మాత్రమే కాదు. దేశ ఆహార భద్రత, వంటనూనెల స్వయం సమృద్ధి, విదేశీ మారకద్రవ్య పొదుపు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వంటి అనేక అంశాలతో ముడిపడిన వ్యూహాత్మక పంట.

ఒక హెక్టారులో సంవత్సరానికి సుమారు 3 నుంచి 5 టన్నుల వరకు పామాయిల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఆయిల్‌పామ్‌కు ఉంది. ఇతర నూనెగింజల పంటలతో పోలిస్తే అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఇది గుర్తింపు పొందింది. దేశంలో పెరుగుతున్న వంటనూనెల డిమాండ్‌ను తీర్చడంలో ఆయిల్‌పామ్ కీలక పాత్ర పోషించగలదని వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సాగు:

దేశంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం సాగు విస్తీర్ణం ఇలా ఉంది.

దేశం వ్యాప్తంగా పామాయిల్ సాగు రాష్ట్రాల వారీ విస్తీర్ణం ఎకరాల్లో...

రాష్ట్రం                                      విస్తీర్ణం

ఆంధ్రప్రదేశ్                            6,98,000 

తెలంగాణ                             2,95,000 

కర్ణాటక                                 1,33,000 

తమిళనాడు                             85,000 

మిజోరం                                   75,000 

అరుణాచల్ ప్రదేశ్                      62,000 

అసోం                                        41,000 

ఒడిశా                                        33,107 

త్రిపుర                                        16,000 

ఛత్తీస్‌గఢ్                                      9,784

మణిపూర్                                     9,000

నాగాలాండ్                                   9,000 

గుజరాత్                                       6,757  

కేరళ                                              6,322

గోవా                                             1,020 

మొత్తం: సుమారు 15,82,000 ఎకరాలు

వంటనూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో జాతీయ వంటనూనెల మిషన్ - ఆయిల్‌పామ్ (NMEO–OP - ఎన్ఎంఈఓ - ఓపీ) ను ప్రారంభించింది. భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సాగు విస్తరణ జరగకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు.

మూడు, నాలుగేళ్లు ఆదాయం లేని సాగు:

ఆయిల్‌పామ్ రైతు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అధిక ప్రారంభ పెట్టుబడి ఒకటి. మొక్కలు నాటిన తర్వాత సాధారణంగా మూడు నుంచి నాలుగేళ్ల వరకు వాణిజ్య దిగుబడి రావడం ప్రారంభం కాదు. ఈ కాలమంతా రైతు ఆదాయం లేకుండానే తోటల నిర్వహణ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. భూమి తయారీ, మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్, ఎరువులు, కూలీల ఖర్చులు, నీటి నిర్వహణకు భారీగా పెట్టుబడి పెట్టాలి. కానీ భవిష్యత్తులో గెలల ధర ఎలా ఉంటుంది? పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుందా? అనే ప్రశ్నలకు రైతులకు స్పష్టమైన భరోసా ఉండటం లేదు.


వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటల ద్వారా సీజనల్ ఆదాయం పొందే అవకాశం ఉండగా, ఆయిల్‌పామ్‌లో ఆదాయం కోసం దీర్ఘకాలం వేచి ఉండాల్సి రావడం రైతులను వెనక్కి నెడుతున్నది.

నీరే ప్రధాన సమస్య:

ఆయిల్‌పామ్ సాగుకు ఏడాది పొడవునా నిరంతర నీటి వసతి అవసరం. తగిన నీటి వనరులు లేని ప్రాంతాల్లో కూడా సాగును ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని రైతు సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

అనుకూల నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత వంటి అంశాలను శాస్త్రీయంగా పరిశీలించకుండా కేవలం విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా సాగును ప్రోత్సహిస్తే రైతుల పెట్టుబడులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కొక్కెరపాటి పుల్లయ్య పేర్కొన్నారు.

ఫ్యాక్టరీ దూరమైతే రైతు కే భారం:

ఆయిల్‌పామ్ గెలలు కోసిన తర్వాత వీలైనంత త్వరగా ప్రాసెసింగ్ చేయాలి. ఫ్యాక్టరీలు దూరంగా ఉంటే రవాణా ఖర్చులు పెరగడంతో పాటు గెలల నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ఆలస్యం కావడం ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అడ్డంకిగా మారుతున్నది. తోటల నుంచి గెలలను సేకరించడానికి తగిన రవాణా వ్యవస్థ లేకపోవడం, కలెక్షన్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం కూడా రైతులకు అదనపు భారంగా మారుతున్నది.

మొక్కలు నాటించడమే లక్ష్యమా?:

కొన్ని సంస్థలు మొక్కలు పంపిణీ చేసి నాటించే లక్ష్యాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. మొక్కలు నాటిన తర్వాత రైతుకు అవసరమైన నిరంతర సాంకేతిక సహకారం అందడం లేదని రైతులు చెబుతున్నారు.

నీటి యాజమాన్యం, ఫర్టిగేషన్, ఎరువుల వినియోగం, పరాగసంపర్కం, చీడపీడల నివారణ వంటి అంశాల్లో సరైన సమయంలో మార్గదర్శకత్వం అందకపోతే తోటల ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉంది.

చెల్లింపులు, తూకంపై సందేహాలు:

గెలల కొనుగోలు తర్వాత చెల్లింపులు ఆలస్యం కావడం, తూకంలో తరుగు, ధర నిర్ణయంలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలు రైతుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని రైతు సంఘం పేర్కొంది.

ప్రత్యేకించి ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్) లెక్కింపులో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తున్నది. ఫ్యాక్టరీల్లో గెలల నుంచి ఎంత శాతం నూనె వెలికితీశారనే అంశం ధర నిర్ణయంలో కీలకమైనందున, దీనిపై స్వతంత్ర పర్యవేక్షణ అవసరమని సూచించింది.

ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కడ?:

ప్రభుత్వ శాఖలు మొక్కల పంపిణీ, కొత్తగా నాటిన విస్తీర్ణం వంటి గణాంకాలకే పరిమితం కాకుండా, నాటిన తోటల పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రైతు సంఘం డిమాండ్ చేసింది.

ఎన్ని తోటలు నిలబడ్డాయి? ఎన్ని తోటలు దిగుబడికి వచ్చాయి? రైతుకు వాస్తవంగా ఎంత ఆదాయం వస్తున్నది? పెట్టుబడి ఎంత? లాభనష్టాల పరిస్థితి ఏమిటి? వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

నాణ్యమైన మొక్కలు అత్యవసరం:

ఆయిల్‌పామ్ సాగులో నాణ్యమైన మొక్కల లభ్యత అత్యంత కీలకం. జన్యుపరమైన నాణ్యత లేని మొక్కలు, ఆఫ్‌టైప్ మొక్కలు, నర్సరీల నిర్వహణలో లోపాలు ఉంటే భవిష్యత్తులో రైతులు తక్కువ దిగుబడులతో నష్టపోయే అవకాశం ఉంది.

సరైన మొక్కల దూరం, పరాగసంపర్కం, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ వంటి అంశాల్లో శాస్త్రీయ పద్ధతులు పాటించకపోతే భారీ పెట్టుబడి పెట్టిన రైతుకు ఆశించిన ఫలితం దక్కదని పుల్లయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

పామాయిల్ రంగంలో తెలుగు రాష్ట్రాల కీలక పాత్ర:

భారతదేశంలో ముడి పామాయిల్ ఉత్పత్తిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశీయ వంటనూనెల ఉత్పత్తిని పెంచే లక్ష్యంలో ఈ రెండు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ టీజీ ఆయిల్‌ఫెడ్ ఆర్యంలో ప్రాసెసింగ్ సామర్థ్యం పెరిగింది.


అశ్వారావుపేట, అప్పారావుపేట ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తుండగా, సిద్దిపేట జిల్లా నర్మెట్టలో కూడా ప్రాసెసింగ్, రిఫైనరీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి వల్ల ప్రైవేట్ కంపెనీలపై కొంతవరకు నియంత్రణ, ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడే అవకాశం ఉందని రైతు సంఘం పేర్కొంటున్నది.

కేంద్రం చేపట్టాల్సిన చర్యలు: దేశీయ విత్తన తోటలు ఏర్పాటు చేయాలి...

ఆయిల్‌పామ్ మొక్కల కోసం విదేశీ విత్తనాలపై ఆధారపడటం తగ్గించాలి. దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ దేశంలో అవసరమైన స్థాయిలో విత్తన తోటలు ఏర్పాటు కాకపోవడం ఆందోళనకరమని రైతు సంఘం పేర్కొంది.

దేశీయంగా సీడ్ గార్డెన్లు ఏర్పాటు చేసి నాణ్యమైన ఆయిల్‌పామ్ మొక్కల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.

స్థిరమైన రక్షణ ధర కల్పించాలి:

అంతర్జాతీయ మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల భారాన్ని పూర్తిగా రైతుపై మోపకూడదని రైతు సంఘం డిమాండ్ చేసింది. సాగునీరు, ఎరువులు, కూలీల ఖర్చులు, తోటల నిర్వహణ వ్యయం ఆధారంగా గెలలకు స్థిరమైన రక్షణ ధర కల్పించాలని కోరింది.

క్రూడ్ పామాయిల్ ధర, ఓఈఆర్ లెక్కింపు వంటి అంశాల్లో రైతుకు అన్యాయం జరగకుండా పారదర్శకమైన ధర నిర్ణయ విధానం ఉండాలని పేర్కొంది.

దిగుమతి సుంకాల్లో స్థిరమైన విధానం:

ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల నుంచి వచ్చే చౌక పామాయిల్ కారణంగా దేశీయ రైతుల ఉత్పత్తులకు ధరలు పడిపోకుండా కేంద్రం రక్షణ చర్యలు చేపట్టాలి. దిగుమతి సుంకాలను తరచూ మార్చడం వల్ల మార్కెట్‌లో అస్థిరత ఏర్పడుతోందని రైతు సంఘం విమర్శించింది. దేశీయ ఉత్పత్తిదారులు, వినియోగదారులు రెండింటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక, స్థిరమైన దిగుమతి విధానాన్ని రూపొందించాలని కోరింది.

ప్రైవేట్ గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేయాలి:

ఆయిల్‌పామ్ రంగంలో ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యం పెరిగితే రైతుల బేరసారాల శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ రైతు సంఘం హెచ్చరించింది. ధర నిర్ణయం, గెలల కొనుగోలు, చెల్లింపులు, సాంకేతిక సేవలు వంటి అంశాల్లో కంపెనీలు ఏకపక్షంగా వ్యవహరించకుండా పటిష్టమైన ప్రభుత్వ నియంత్రణ అవసరమని పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు, రిఫైనరీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీని కొనసాగించి రైతుకు న్యాయమైన ధర అందించడంలో కీలకమని పేర్కొంది.


- 24 గంటల్లో సేకరణ.. సకాలంలో చెల్లింపుఆయిల్‌పామ్ గెలలను కోసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోపు ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల గెలల సేకరణ, రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని రైతు సంఘం కోరింది. రైతుల నుంచి గెలలు కొనుగోలు చేసిన తర్వాత  7 నుంచి 14 రోజుల్లోపు చెల్లింపులు  వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేసింది.

డిజిటల్ తూకం.. పారదర్శక ఓఈఆర్:

కలెక్షన్ కేంద్రాల్లో డిజిటల్ కాంటాలను ఏర్పాటు చేసి, తూకం వివరాలు రైతులకు వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ఓఈఆర్ లెక్కింపు పారదర్శకంగా జరగాలని, కొనుగోలు వివరాలు, చెల్లింపుల సమాచారాన్ని డిజిటల్ వ్యవస్థ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాలని కోరింది. రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

ఆయిల్‌ఫెడ్‌ను బలోపేతం చేయాలి..ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయాలి

తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థ టీజీ ఆయిల్‌ఫెడ్ పనితీరు వల్ల ఆయిల్‌పామ్ రైతులకు ఒక ప్రత్యామ్నాయ మార్కెట్ వ్యవస్థ అందుబాటులో ఉందని రైతు సంఘం పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాసెసింగ్ సంస్థల మధ్య పోటీ ఉండటం రైతులకు ప్రయోజనకరమని తెలిపింది. అయితే, ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ అభివృద్ధి చేసిన జోనల్ ప్రాంతాలను ప్రైవేట్ ఆయిల్‌పామ్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నదని కొక్కెరపాటి పుల్లయ్య పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ రంగాన్ని పెద్ద బహుళజాతి, ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి అప్పగించడం జరిగితే రైతుల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయకుండా బలహీనపరచడం, అభివృద్ధి చేసిన ప్రాంతాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం దీర్ఘకాలంలో రైతులకు నష్టం కలిగించవచ్చని ఆయన అన్నారు.


లక్ష్యం విస్తీర్ణం కాదు.. రైతు భద్రత కావాలి:

దేశాన్ని వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లాలంటే కేవలం లక్షల ఎకరాల్లో మొక్కలు నాటడమే పరిష్కారం కాదని రైతు సంఘం స్పష్టం చేసింది. రైతుకు నీటి భద్రత, నాణ్యమైన మొక్కలు, సాంకేతిక సహాయం, ప్రాసెసింగ్ సౌకర్యం, సకాలంలో కొనుగోలు, పారదర్శక ధర నిర్ణయం, స్థిరమైన ఆదాయం కల్పించినప్పుడే ఆయిల్‌పామ్ లక్ష్యాలు నెరవేరుతాయని పేర్కొంది.

ప్రభుత్వాల మారుతున్న విధానాలు, దిగుమతి సుంకాల హెచ్చుతగ్గులు, ధరల్లో అనిశ్చితి, ప్రైవేట్ కంపెనీల పెరుగుతున్న ఆధిపత్యం కొనసాగితే ఆయిల్‌పామ్ సాగు విస్తరణ లక్ష్యాలు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.


దేశీయ వంట నూనెల స్వయం సమృద్ధి లక్ష్యాన్ని సాధించాలంటే ఆయిల్‌పామ్ రైతును కేంద్రంగా చేసుకుని సమగ్ర, దీర్ఘకాలిక విధానాన్ని రూపొందించాలని, ప్రభుత్వ రంగ టీజీ ఆయిల్‌ఫెడ్‌ ను మరింత బలోపేతం చేసి ప్రైవేటీకరణ, గుత్తాధిపత్య ధోరణులను అడ్డుకోవాలని *తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య* డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్