నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి వరద ఉద్ధృతిలో చిక్కుకున్న మత్స్యకారులతో పాటు వారిని సురక్షితంగా రక్షించిన ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందిని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. ఆయన సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకుంటూ, వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అలాగే మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సత్తుపల్లి పట్టణంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో కింద అంతస్తుల్లో నివసిస్తున్న 32 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న సండ్ర వెంకట వీరయ్య, నేరుగా కాలనీకి చేరుకుని బాధితులను పరామర్శించారు. వరద నీరు చేరడంతో ఇంట్లోని సామగ్రి, నిత్యావసరాలు దెబ్బతిన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరద ప్రభావిత ఇళ్లను పరిశీలించిన ఆయన బాధితులకు ధైర్యం చెప్తూ, ఆపద సమయంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని, తగిన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, నాయకులు అద్దంకి అనిల్, గుండ్ర రఘు, పర్వతనేని వేణు పాల్గొన్నారు.







కామెంట్లు (0)