- నారుమడి నుంచి ప్రధాన పొలం వరకు రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
- ఐసీఏఆర్,ఎన్ఐఆర్సీఏ ఆర్ఎస్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్ తేళ్ల రమేష్
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఇటీవల సంభవించిన తుఫాన్లు, భారీ వర్షాల ప్రభావంతో ఆహార ధాన్య పంటలతో పాటు వాణిజ్య పంటలకు కూడా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో అధిక వర్షపాతం సమయంలో పొగాకు నారుమడులు, ప్రధాన పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీఏఆర్ - ఎన్ఐఆర్సీఏ ఆర్ఎస్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్ తేళ్ల రమేష్ సూచించారు.
అశ్వారావుపేట మండలంలో సాగవుతున్న వర్జీనియా పొగాకు పంటను సోమవారం ఆయన పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర తేలిక నేలల్లో పొగాకు నారుమడులు వివిధ దశల్లో ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ప్రధాన పొలాల్లో నాట్లు కూడా పూర్తయ్యాయని
తెలిపారు.
గత వారంలో సంభవించిన "అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర తేలిక నేలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మురసు తుఫాన్ ప్రభావంతో ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయని తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పొగాకు రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.
నారుమడి లో ముందస్తు జాగ్రత్తలు:
భారీ వర్షాలకు ముందు నారుమడులు భూమి మట్టం కంటే 15 - 20 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. నారుమడుల చుట్టూ ఉన్న మురుగునీటి కాలువలను శుభ్రం చేయడంతో పాటు, నీరు వేగంగా బయటకు వెళ్లేందుకు అత్యవసర పక్క కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైన సమయంలో తాత్కాలిక రక్షణ కోసం పారదర్శక పాలిథీన్ షీట్లను సిద్ధంగా ఉంచుకోవాలని, వర్ష సూచనలు ఉన్నప్పుడు అధిక నీటిపారుదలను నివారించాలని తెలిపారు.
తెగుళ్ల నివారణకు చర్యలు:
మాగుడు, కాలర్రాట్ లేదా కాండం కుళ్లు, మానుమచ్చ వంటి తెగుళ్ల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కాపర్ ఆక్సీక్లోరైడ్ను 10 లీటర్ల నీటికి 20 గ్రాముల చొప్పున కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిచేలా పోయాలని తెలిపారు. తెగులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మెటలాక్సిల్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని నిపుణుల సూచనల మేరకు వినియోగించాలని పేర్కొన్నారు.
అలాగే మెటరా 6మ్ + పైరాక్లోస్ట్రోబిన్ లేదా ఆజాక్సిస్ట్రోబిన్ వంటి శిలీంద్రనాశకాలను సిఫార్సు చేసిన మోతాదులో ఉపయోగించి ఆకులు, కాలర్ భాగం బాగా తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు.
నాట్లు వేసే సమయంలో జాగ్రత్తలు:
పల్లపు పొలాల్లో నాట్లు వేయకుండా ఉండటం మంచిదని తెలిపారు. నాట్లకు ముందు నారును క్షుణ్ణంగా పరిశీలించి మానుమచ్చ, వేరుకా 6 య, కాలర్రాట్, మాగుడు తెగుళ్లు సోకిన మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన పొలంలో నాటరాదని స్పష్టం చేశారు.
ఆరోగ్యవంతమైన నారును బోదెలుకాలువల పద్ధతిలో** మాత్రమే నాటాలని సూచించారు. పొలంలో సరైన ఉపరితల మురుగుపారుదల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని, వర్ష సూచనలు వచ్చిన వెంటనే మురుగు కాలువలను శుభ్రం చేయాలని తెలిపారు. కాలువల నుంచి నీరు బయటకు వెళ్లే మార్గాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి, పొలాల సరిహద్దుల్లో అత్యవసర డ్రైనేజీ కాలువలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
పోషకాలు, ఎరువుల యాజమాన్యం
పొలంలో అధిక తేమ ఉన్నప్పుడు పొగాకు మొక్కలు నేలలోని పోషకాలను వేర్ల ద్వారా సమర్థవంతంగా తీసుకోలేవని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో నీటిలో కరిగే ఎరువులైన 19:19:19 లేదా 13:0:45 వంటి ఎరువులను ఆకులపై పిచికారీ చేయడం ద్వారా పోషకాలను అందించవచ్చని పేర్కొన్నారు. నాట్లు వేసిన తర్వాత 50 శాతం కంటే ఎక్కువ మొక్కలు తెగుళ్ల బారిన పడితే, ఆ పొలాన్ని దున్ని మళ్లీ నాట్లు వేయడం మంచిదని సూచించారు. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు సిఫార్సు చేసిన ఎరువులను అందించడం ద్వారా పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
వర్షాలు తగ్గిన తర్వాత మొక్కకు రెండు వైపులా గశిక వేసి వేర్లకు గాలి తగిలేలా చేయాలని, అనంతరం అవసరమైన ఎరువులను వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు వేయాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా మొక్కలు ఒరిగిపోతే వాటిని లేపి నిలబెట్టి మట్టిని కుదించి స్థిరంగా ఉంచాలని తెలిపారు. ప్రధాన పొలంలో ఎరువులు వేసిన తర్వాత 100 మిల్లీమీటర్లకు మించి వర్షపాతం నమోదైతే, పోషక నష్టాన్ని అంచనా వేసి వ్యవసాయ నిపుణుల సలహాతో అదనపు ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సరైన వాతావరణ ఆధారిత యాజమాన్య పద్ధతులను పాటిస్తే పొగాకు పంటను కాపాడుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తేళ్ల రమేష్ తెలిపారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని శాస్త్రీయ సూచనలు పాటించాలని ఆయన కోరారు.






కామెంట్లు (0)