Magazines

336 ఎకరాలకు రీసర్వే షాక్!..

20 నిమిషాల క్రితం

choutakur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

- భూభారతి పైలెట్ గ్రామంగా శేరిరాంరెడ్డిగూడెం ఎంపిక..

- 194 సర్వే నంబర్లలో భూముల సమగ్ర పరిశీలన..

- విడతల వారీగా రంగంలోకి దిగనున్న రెవెన్యూ యంత్రాంగం..

- సర్వేకు సహకరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపు..

నవతెలంగాణ - చౌటకూర్ : గ్రామీణ భూ రికార్డుల్లో స్పష్టత.. భూముల హద్దులకు కచ్చితత్వం.. భూ వివాదాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా భూభారతి పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం చౌటకూర్ మండలంలోని శేరిరాంరెడ్డిగూడెం గ్రామంలో భారీ భూ రీసర్వేకు రంగం సిద్ధమైంది. మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ గ్రామంలో ఏకంగా 194 సర్వే నంబర్ల పరిధిలోని సుమారు 336 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు విడతల వారీగా సమగ్రంగా సర్వే చేయనున్నారు. ఈ కీలక ప్రక్రియతో గ్రామంలోని భూముల వివరాలు, హద్దుల నిర్ధారణపై స్పష్టత రానుండటంతో రైతులు, భూయజమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శేరిరాంరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామంలో చేపట్టనున్న భూ రీసర్వే ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. భూములకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులతో సరిపోల్చుకుంటూ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. భూముల హద్దులు, సర్వే వివరాల విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. భూభారతి పథకం ద్వారా భూ రికార్డులను మరింత పటిష్టం చేయడంతో పాటు భవిష్యత్తులో భూముల విషయంలో తలెత్తే వివాదాలు, అపోహలకు ఆస్కారం లేకుండా చూడటం ఈ రీసర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు వివరించారు. 194 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న 336 ఎకరాల భూమిని ఒకేసారి కాకుండా విడతల వారీగా పరిశీలించి సర్వే చేయనున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే గ్రామంలోని భూ వివరాల నమోదుకు మరింత స్పష్టత లభించే అవకాశం ఉంది.

ఈ కార్యక్రమంలో ఆందోల్ ఆర్డీవో రమేష్ బాబు, చౌటకూర్ మండల తహసీల్దార్ విజయలక్ష్మి, నాయబ్ తహసీల్దార్ అనుదీప్, ఎంపీడీవో కే. శంకర్, ఎంపీవో రాజ్ కుమార్, ఆర్ఐ ప్రమోద్ కుమార్, గ్రామ సర్పంచ్ బైరు భాస్కర్,ఉపసర్పంచ్ చంద్రయ్య,వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్