మాజీ సర్పంచ్ మహమ్మద్ రఫీ
నవతెలంగాణ-మిడ్జిల్
అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండల పరిధిలోని కంచనపల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మహమ్మద్ రఫీ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. గతంలో మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా, అభివృద్ది, అర్హులైన పేద వారికే సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో మూడేండ్ల కాలంలో అభివృద్ది ఏ మూలకు కనిపించడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల నాయకులతో పాటు కార్యకర్తలు కూడా నీచమైన భాషతో ప్రజలకు విరక్తి తెప్పిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రతిపక్ష నాయకులపై బూతులతో చెలరేగి పోవడానికి కాదని, సంక్షేమం, అభివృద్ధి, విద్యా, ఉద్యోగం, పేదరిక నిర్మూలన, రైతులకు అండగా ఉండేందుకని గుర్తు చేశారు. తాను పదేళ్ల పాటు సర్పంచ్‌గా పనిచేసిన కాలంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సహకారంతో కంచనపల్లి గ్రామంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లను పూర్తి చేశానని తెలిపారు. అలాగే కూరగడ్డపల్లి నుండి దోనూర్ వరకు బీటీ రోడ్డును పూర్తి చేశామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న రోడ్డు కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా పెద్ద పెద్ద గుంతలుగా మారిందని విమర్శించారు. వాహనాలు వెళితే ప్రమాదాల బారిన పడుతున్నా పాలకులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నూతన రోడ్డు వేసే వరకు బీటీ రోడ్డు మరమతులు చేపట్టి గుంతలు పూడ్చాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విద్య వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
'మన ఊరు - మన బడి' కార్యక్రమంలో భాగంగా కంచనపల్లి గ్రామ పాఠశాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని రఫీ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మాజీ సర్పంచ్ రఫీ డిమాండ్ చేశారు. చేదు గట్టు తాండా గుట్ట నుండి అక్రమంగా మైనింగ్ ఏర్పాటుచేసి, అనుమతుల చాటున అధిక లోడుతో టిప్పర్లు వెళ్లడంతో బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ రెవెన్యూ ,అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సంక్షేమ పథకాల అమలులో అవినీతిని లేకుండా అర్హులందరికీ న్యాయం చేయాలని, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.






కామెంట్లు (0)