నవతెలంగాణ మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం ఒక తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల ప్రాయపు బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం మేరకు,మల్లాపూర్‌లోని వడ్డెర కాలనీకి చెందిన ఆరేళ్ల బాలుడు సూర బన్నీ సాయంత్రం వేళ ఆడుకుంటూ ఇళ్ల మధ్యలో పశువులకు నీళ్లు తాగించేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టి వద్దకు వెళ్లాడు.ప్రమాదవశాత్తు ఆ తొట్టిలో పడిపోయిన బాలుడు బయటకు రాలేక ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
కూలీ పనులకు వెళ్లిన బాలుడి తల్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొడుకు కనిపించకపోవడంతో ఆందోళనతో చుట్టుపక్కల వెతికారు.చివరకు పశువుల నీటి తొట్టిలో బాలుడు విగతజీవిగా తేలియాడుతూ కనిపించాడు.ఈ దారుణ దృశ్యం చూసిన తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.వారి రోదనలు మిన్నంటాయి.
ఈ ఘటనతో వడ్డెర కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చిన్న పిల్లలను నీటి వనరుల వద్ద వదిలిపెట్టేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.





కామెంట్లు (0)