మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు : డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పిల్లల కోసం వినియోగించే అల్మాంట్-కిడ్ (Almont-Kid) సిరప్‌లో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు (ఇథిలీన్ గ్లైకాల్) ఉన్నట్టు గుర్తించామనీ, ఆ సిరప్‌ను వాడొద్దని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన ఏఎల్ -24002 బ్యాచ్ సిరప్‌లలో కల్తీ జరిగినట్టు బెంగాల్‌లో గుర్తించారని తెలిపారు. ఈ బ్యాచ్ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడకం ఆపేయాలని ప్రజలకు సూచించారు. మార్కెట్‌లో ఆ సిరప్ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. దీనిపై సమాచారం లేదా ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరు 1800-599-6969లో సంప్రదించాలని సూచించారు.



