నవంబర్ 14 పిల్లల నవ్వుల పండుగ. పండిట్ నెహ్రూ గారి కల – పిల్లలందరూ ఆనందంతో, ఆత్మవిశ్వాసంతో పెరగాలి. కానీ నేటి కాలంలో తెలివితేటలు పెరిగినా, పిల్లల ముఖం మీద ఆ సున్నితమైన ఆనందం ఎక్కడికో మాయమైంది. విజ్ఞానం అరచేతిలోకి వచ్చేసింది, కాని మమకారం మాత్రం చేతులు దాటి పోతోంది.
మా అబ్బాయి చిన్నారి హిమకర్, సీత ప్రశ్నలు ఇలా వున్నాయి… ”పూర్వం వాళ్లు వీధి లైట్లు కింద చదివారట, అప్పుడు పగలు లేవా?” అని హిమకర్ అడిగాడు. అది చిన్న పిల్లల మనసు కాదు, సహజమైన ఆలోచనా సామర్థ్యం. సీత చెప్పింది – ”రామాయణ కాలం నాటి సీత ఇప్పుడు పుడితే మాలాగే ఉంటుంది!” ఆ మాటలో ఉంది సమాజంపై చైతన్యం, కాలానుగుణమైన దక్కోణం. కానీ ఈ తెలివైన మాటల వెనుక మనం గమనించాల్సినది… పిల్లలు ప్రశ్నలు అడుగుతున్నారు, కానీ మనం సమాధానాలు చెప్పడం కంటే ‘ఫోన్ కాల్స్’లో బిజీగా ఉన్నాం.
మానసిక ఆవేదన – ఫోన్‌గా పుడతానన్న బాబు
ఒక బాబు తల్లిని ఇలా అడిగాడు… ”అమ్మా… నన్ను నీ పొట్టలోకి మళ్లీ పంపించు!” అని. తల్లి ఆశ్చర్యపోయి ”ఎందుకయ్యా?” అని అడిగింది. అప్పుడు ఆ బాబు… ”నేను ఫోన్‌గా పుడతాను అమ్మా. ఎందుకంటే ఫోన్ రింగ్ రాగానే మీరు లిఫ్ట్ చేస్తారు, నేను ఏడ్చినా, ఎన్నిసార్లు పిలిచినా మాత్రం మీరు లేట్‌గా స్పందిస్తారు. ఫోన్ మీ చేతిలో 24 గంటలు ఉంటుంది. నేను ఫోన్ అయితే, కనీసం మీ చేతుల్లోనే ఉంటాను కదా” అన్నాడు. ఇది ఈ ఒక్క చిన్నారి బాధ కాదు, మానసికంగా ఒంటరితనానికి ప్రతీక. పిల్లలు మన స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ఎమోషనల్ సిగల్ లాస్‌లో పడిపోతున్నారు.
దీన్ని భావోద్వేగ స్థానభ్రంశం (Emotional Displacement) అంటారు. ప్రేమను మనిషి నుంచి వస్తువులపైకి మార్చినప్పుడు, పిల్లల మనసు ‘ప్రేమ ఆకలి’ అనే పరిస్థితిలోకి వెళ్తుంది. ఆధునిక పిల్లలు – తెలివి ఉన్నా, స్పర్శ లేని కాలం నేటి పిల్లలు Digital Natives స్క్రీన్‌లలో ప్రపంచం తెలుసుకుంటున్నారు. కానీ తల్లిదండ్రుల కౌగిలిలో ప్రేమ కనుగొనడం కష్టమైపోతోంది. పాఠశాలల్లో మార్కులు పెరుగుతున్నా, సంబంధాలు తగ్గిపోతున్నాయి. విజ్ఞానం పెరిగింది, కానీ భావాలు క్షీణిస్తున్నాయి. తల్లిదండ్రులు ప్రేమను ‘ఇంటర్నెట్ స్పీడ్’తో కొలుస్తున్నారు. పిల్లలు మాత్రం ‘మనసు కనెక్షన్’ కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రేమ పాఠం నేర్పే సమయం :
పిల్లలకు నేడు కావలసింది gadgets కాదు, gestures. ఒక స్మైల్, ఒక గేమ్ టైమ్, ఒక చిన్న కథ.. ఇవే వాళ్ల ఎమోషనల్ ఇమ్యూనిటీని పెంచుతాయి. ‘ఏందుకు అడుగుతున్నావ్?’ అనే ప్రశ్న కాకుండా, ‘నువ్వు ఎంత బాగా ఆలోచిస్తున్నావ్!’ అని ప్రోత్సహించండి. ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడే కాదు, మనసులు కూడా రీఛార్జ్ చేయాలి. బాలల దినోత్సవం అంటే బహుమతులు కాదు, బాల్యాన్ని బతికించడం. వారి నవ్వు మళ్లీ మన ఇళ్ళలో ప్రతిధ్వనించాలి. విజ్ఞానం మన చేతుల్లో ఉంది. కానీ పిల్లల చేతుల్లో మన చేతులు ఉండడం అదే నిజమైన బాలల దినోత్సవం అర్థం.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్



