Saturday, January 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకుక్కల స్వైరవిహారం

కుక్కల స్వైరవిహారం

- Advertisement -

వాహనాల వెంట పడటంతో ప్రమాదాలు
ఖమ్మంలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి
సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా.. పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

నవతెలంగాణ-గాంధీ చౌక్‌(ఖమ్మం)
వీధుల్లో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. రోడ్లపై అటు ఇటుగా వెళ్లే వాహనాల వెంట పడుతుండడంతో పలువురు భయంతో వేగంగా వెళ్లడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. రాష్ట్రంలో అనేక మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లు, పట్టణాలు, నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో.. ఇలా ప్రతిరోజూ కుక్కకాటుకు గురైన సంఘటనలు లేని వార్తలు ఉండటం లేదు. ఖమ్మం పట్టణంలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కామారెడ్డిలో కుక్కల బెడద తాళలేక 500 కుక్కలను చంపేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా, కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేటర్లు, ప్రజలు వీధికుక్కల విషయంలో కమిషనర్‌కు, మేయర్‌కు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కుక్కల్ని నియంత్రణ చేయడంలో పాలకవర్గం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. చాలాచోట్ల ప్రకటనలు తప్ప. ఆయా ప్రాంతాలను సందర్శించి జనానికి సూచనలు చేయడం గానీ, నోటీసులు అంటించటం గానీ, ప్లైక్సీలు పెట్టడం గానీ చేయడం లేదు.

నగరంలో సుమారు 5వేల వీధి కుక్కలు
ఖమ్మం నగరంలో సుమారు 5వేల వీధి కుక్కలు ఉన్నట్లు కార్పొరేషన్‌ అధికారులు గుర్తించారు. అయితే వీధి కుక్కల నియంత్రణ అధికారులకు తలకు మించిన పని అయింది. గతంలో వీధి కుక్కలను పట్టుకు వెళ్లి చంపేవారు. వీధికుక్కలను చంపటం పట్ల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దీన్ని నేరంగా పరిగణిస్తూ తీర్పు వచ్చింది. దీంతో కేవలం కుక్కల్ని తీసుకువెళ్లి ఊరి బయట వదిలివేయటం లేదా కుక్కల సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించడం మాత్రమే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా పశు సంవర్ధక శాఖ సహకారంతో కార్పొరేషన్‌ అధికారులు కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించేందుకు ఖమ్మంలో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే వీధి కుక్కలను తీసుకురావడం కేంద్రంలో సంరక్షించడం తప్ప అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న వీధి కుక్కలను నియంత్రించేందుకు ఎటువంటి ప్రణాళిక లేదు. దాంతో అవి వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నాయి.

తాజాగా ఇద్దరు మృతి
వీధి కుక్కలు వాహనాల వెంట పడటంతో భయపడ్డ ఇద్దరు వ్యక్తులు వాహనం నుంచి కింద పడి మృతి చెందిన సంఘటన వారం రోజుల వ్యవధిలోనే ఖమ్మం నగరంలో జరిగింది. ఒక వ్యక్తి ప్రయివేట్‌ పాఠశాలలో పనిచేస్తున్న భార్యని తీసుకొచ్చేందుకు ఎఫ్‌సీఐ గోడౌన్‌ సమీపంలోకి వెళ్ళగానే వీధి కుక్కలు వెంటబడి తరమడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. టేకులపల్లి గోశాల సమీపంలో విద్యుత్‌ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగి రాత్రివేళ వాహనంపై వస్తుండగా వీధి కుక్కలు తరమడంతో భయపడి వాహనం స్పీడ్‌ పెంచి అదుపుతప్పి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. వీధి కుక్కల బెడదతో రాత్రిపూట ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

పలు ప్రాంతాల్లో వీధి కుక్కల తిష్ట
నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఎక్కువ సంఖ్యలో తిష్ట వేస్తున్నాయి. ముస్తఫా నగర్‌, ఎన్‌ఎస్టి రోడ్‌, టేకులపల్లి, వేణుగోపాల్‌ నగర్‌, మామిళ్ళగూడెం, పాండు రంగాపురం, బల్లెపల్లి, బాలపేట, వైయస్సార్‌ నగర్‌ కాలనీ, త్రీటౌన్‌ ప్రాంతాల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. దారిలో పోయే వారి వెంటపడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -