Tuesday, March 24, 2026
E-PAPER
Homeబీజినెస్డాలర్‌ @94

డాలర్‌ @94

- Advertisement -

మోడీ హయాంలో రూపాయి మహా పతనం

ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజురోజుకు అత్యంత అధ్వానంగా మారుతోంది. భారత దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోడీ హయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 94 మార్క్‌కు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, భారత్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో సోమవారం అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 50 పైసలు పతనమై రికార్డు స్థాయిలో 94.03కు దిగజారింది. ఉదయం ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజీలో 93.84 వద్ద తెరుచుకున్న రూపాయి.. వెంటనే 94కు పడిపోయింది.

శుక్రవారం 64 పైసలు క్షీణించి 93.53 కనిష్టాన్ని తాకి.. తొలిసారి 93 మార్క్‌ను చేరిన రూపాయి విలువ మరో సెషన్‌లోనే 94 మార్క్‌ను దాటడం తీవ్ర ఆందోళనకర అంశం. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒక్కరోజే 1,836 పాయింట్లు కుప్పకూలడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో రూపాయి విలువ రూ.93.60 నుండి 94.40 మధ్య ట్రేడ్‌ అయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యం చేసుకుంటే దిగువ స్థాయిల వద్ద కొంత మద్దతు లభించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ పతనం కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోంది. రూపాయి విలువ ఇలాగే క్షీణిస్తూ ఉంటే దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పే ప్రమాదం ఉంది. మనం దిగుమతి చేసుకునే చమురు, గ్యాస్‌, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల సామాన్యుడిపై భారంతో పాటు రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇది అంతిమంగా వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి, ఆర్థిక వృద్ధి రేటును కుంటుపరుస్తుంది. దిగుమతి వ్యయం పెరగడం వల్ల దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు ప్రమాదకర స్థాయికి చేరుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -