అనర్హత పిటిషన్ల కొట్టివేత : స్పీకర్ ప్రసాద్‌కుమార్ సంచలన తీర్పు
వారిద్దరూ బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సంచలన తీర్పునిచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత పిటిషన్లను ఆయన బుధవారం కొట్టివేశారు. వీరు పార్టీ మారినట్టు ఆధారాల్లేవన్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారిద్దరూ బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున దానం నాగేందర్, కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా వీరు వ్యవహరిస్తున్నారనీ, వీరి శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్, బీజేపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పలుదఫాలుగా విచారణ చేపట్టారు. బుధవారం తుది తీర్పునిచ్చారు.
ఈ విచారణలో తాము ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామనీ, పార్టీ మారలేదని దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దానం, కడియం వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ వీరిద్దరినీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్టు ప్రకటిస్తూ అనర్హత వేటు పిటిషన్లను కొట్టేశారు. దీంతో వారిద్దరికీ ఊరట కలిగింది. ఇదిలా ఉండగా గురువారం సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై విచారణ జరగనుంది. ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసు మళ్లీ విచారణకు వచ్చేలోగా స్పీకర్ తన నిర్ణయం ప్రకటించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన తీర్పు వెలువరించారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చీట్ ఇచ్చినట్టయింది.
పోరాటం ఆపను: దానం నాగేందర్
స్పీకర్ తనపై అనర్హత వేటు వేసినా పోరాటం ఆపబోనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అభివద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏరోజు పనిచేయలేదని స్పష్టం చేశారు. తనకు ఎప్పుడూ ఆ పార్టీ విప్ జారీచేయలేదని వివరించారు. స్పీకర్ పరిధిలో తాను ఎక్కడా పొరపాటు చేయలేదని అభిప్రాయపడ్డారు. ”నాపై బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేసింది. మంగళవారం జరిగిన బీఆర్‌ఎస్ ఎల్పీ భేటీకి నన్ను ఎందుకు పిలవలేదు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే. సీఎం కాలేదని కేసీఆర్‌కు ఎలాంటి బాధ లేదు. ఇబ్బందంతా కేటీఆర్‌కే.” అని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాం..కానీ : కడియం
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తమకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ చట్టబద్ధం కాదని చెప్పారు. స్పీకర్ తనకు క్లీన్‌చీట్ ఇచ్చిన అనంతరం కడియం మీడియాతో మాట్లాడారు. ”బీఆర్‌ఎస్ నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కేసీఆర్ ఎప్పుడూ ప్రజల ముందుకు వచ్చి ఫిరాయింపులపై మాట్లాడలేదు. మేం శాసనసభలో ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. మేం బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాం. ఆ పార్టీ నాయకత్వానికి దూరంగా ఉన్నాం. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకున్నారు’ అని ఆయన గుర్తు చేశారు.



