Friday, May 9, 2025
Homeజాతీయంసుప్రీంకోర్టు తీర్పున్నా డోంట్‌ కేర్‌

సుప్రీంకోర్టు తీర్పున్నా డోంట్‌ కేర్‌

- Advertisement -
  • – పహల్గాం అనుమానితుల ఇండ్లు నేలమట్టం
    – నోటీసుల్లేకుండానే చర్యలు
    – జమ్మూకాశ్మీర్‌ అధికారుల తీరు

    న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అనుమానితుల ఇండ్లను కూల్చివేస్తోన్న అక్కడి అధికారుల తీరు ఆందోళన కలిగిస్తున్నది. షోకాజ్‌ నోటీసులు లేకుండా ఇండ్లు, నిర్మాణాలను కూల్చివేయటాన్ని తప్పుబడుతూ యూపీలోని యోగి సర్కారుకు వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. నివసించే హక్కు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగంగా ప్రాథమిక హక్కు అని సదరు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే, ఇవేవీ కూడా జమ్మూకాశ్మీర్‌ అధికారులు పట్టించు కున్నట్టుగా కనబడటం లేదు. షోకాజ్‌ నోటీసులు లేకుండానే పలు ఇండ్లను కూల్చివేయటం చర్చనీయాంశంగా మారుతున్నది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత గత మూడ్రోజులుగా కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) అనుమానిత కుటుంబాలకు చెందిన కనీసం తొమ్మిది నివాస గృహాలను అధికారులు కూల్చివేశారు. కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌, బందీపోరా, కుప్వారా, కుల్గాం, పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో పహల్గాం దాడిలో పాల్గొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది అనుమానిత ఉగ్రవాదుల కుటుంబాల నివాస గృహాలను కూల్చివేసినట్టు వార్తా కథనాలను బట్టి తెలుస్తున్నది. వీటిలో గత గురు, శుక్రవారాల్లో ఏడు ఇండ్లు, శనివారం మరో రెండు ఇండ్లు నేలమట్టం చేసినట్టు సమాచారం. అనుమానితులు నిషేధిత జైషే మహ్మద్‌, లష్కర్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వాటి అనుబంధ సంస్థలకు చెందినవారని భావిస్తున్నారు. కాగా, ఈ ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు నియంత్రిత పేలుళ్లను ఉపయోగించారని తెలు స్తున్నది. దీని ఫలితంగా అక్కడి పరిసర ప్రాంతాల్లోని కొన్ని ఇండ్లు దెబ్బ తిన్నాయని సమాచారం.’నా కొడుకుకు ఇంటిలో వాటా లేదు’పహల్గాం మారణహోమంలో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిల్‌ థోకర్‌ తల్లి షెహజాదా బానోది కూడా ఇదే పరిస్థితి. ఎలాంటి షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండానే అధికారులు కూల్చివేతలు చేపట్టారని అన్నారు. ”నా కొడుకు ఇంట్లో తన వాటాను ఇంకా పొందలేదు. అది ఇప్పటికీ నా భర్త పేరు మీదనే రిజిస్టరై ఉన్నది. ఆయన (ఆదిల్‌ థోకర్‌) దాడిలో పాల్గొన్నట్టయితే.. కూల్చివేత బహుశా సమర్థనీయమే. కానీ, ఆయన నిర్దోషి అని తేలితే మాకు ఎవరు పరిహారం ఇస్తారు” అని ఆమె వాపోయారు.
    ‘మాకున్న రెండు గదులూ పేల్చేశారు’
    ఈ కూల్చివేతలపై పలు కుటుంబాలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అనుమానితులంటూ.. ఎలాంటి నోటీసులూ జారీ చేయకుండా ఇండ్లను నేలమట్టం చేయటాన్ని వారు తప్పుబడుతున్నారు. ఘటనతో తమకు ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. కేవలం కుటుంబీకులమన్న కారణంతో మా ఇండ్లను పేల్చేయటమేమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు. ” మా ఇంటిని మా తాత నిర్మించాడు. అందులో మాకు రెండు గదులు మాత్రమే ఉన్నాయి. కానీ, వారు దానిని పూర్తిగా కూల్చేశారు” అని అనుమానితుల్లో ఒకరైన ఆసిఫ్‌ షేక్‌ సోదరి యస్మీనా వాపోయారు. ”నా సోదరుడు పహల్గాం దాడిలో పాల్గొన్నా.. మా కుటుంబానికి దానితో సంబంధం ఏంటి? మా తల్లిదండ్రులు చేయని తప్పునకు ఎందుకు శిక్షిస్తున్నారు?” అని ఆమె ప్రశ్నించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -