Tuesday, April 29, 2025
Navatelangana
Homeనేటి వ్యాసంసుప్రీంకోర్టు జోలికి రాకండి!

సుప్రీంకోర్టు జోలికి రాకండి!

- Advertisement -

భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, బీజేపీ నాయకులు సుప్రీంకోర్టు మీద విషపూరిత దాడిని ప్రారంభించారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలుపకుండా అడ్డుపడుతూ తమిళనాడు గవర్నర్‌ అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన పోకడల గురించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ దాడులు మొదలయ్యాయి. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) నాయకత్వం లోని ధర్మాసనం వక్ఫ్‌ చట్టానికి సంబంధించి తాత్కాలిక ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి ధన్కర్‌… న్యాయ మూర్తులు ‘ఎలాంటి జవాబు దారీతనం లేని’, ‘సూపర్‌ పార్లమెంటు’గా తయారయ్యారని ఆరోపించారు. ‘వారికి ఈ దేశపు చట్టాలు వర్తించ వని’ వాకృచ్చారు. అంతేగాక సంపూర్ణ న్యాయం జరిపించేందుకుగాను కోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న 142 అధికరణం ‘ప్రజాస్వామిక శక్తులపై అణు క్షిపణి’ లాగా తయారయ్యిందని కూడా సెలవిచ్చారు. బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే మరింత పైత్య ప్రకోపంతో సిజెఐ సంజీవ్‌ ఖన్నా లక్ష్యంగా దాడి చేశారు. ఆయనే ”దేశంలో అన్ని అంతర్యుద్ధాలకు” కారకుడు అవుతున్నారని దాడి చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేసేటట్లయితే పార్లమెంటును మూసుకోవాలని కూడా ఆ ఎంపీ మాట్లాడారు.న్యాయవ్యవస్థ, పార్లమెంటు తనకు లోబడి ఉండాలని ధన్కర్‌, ఆయన బృందం కోరుకుంటోంది. ఇది రాజ్యాంగ నిర్దేశాలకు వ్యతిరేకమైన విషయం. చట్టసభలు రూపొందించిన శాసనాలను సమీక్షించేందుకు, అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని సమీక్షించేందుకు సుప్రీంకోర్టుకు అధికారం ఉంది. రాజ్యాంగ సవరణలు కూడా దాని ‘మౌలిక స్వభావం’ పరిధిలో ఉన్నాయా అని సుప్రీంకోర్టు సమీక్షించవచ్చు.అసలు కారణంబీజేపీ, పక్షపాతంతో దానికి వంత పాడే ఉపరాష్ట్రపతి వంటి మద్దతుదారులు దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన చారిత్రక తీర్పు కారణం. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి శాసనసభ ఆమోదించిన తీర్మానాలకు అంగీకార ముద్ర వేయకుండా తొక్కి పట్టడాన్ని, తర్వాత వాటిని రాష్ట్రపతికి పంపించడాన్ని విచారించిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. గవర్నర్‌ అనుసరిస్తున్న ఈతీరు చట్టరీత్యా తప్పని, చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆయన ఇలా తొక్కి పట్టిన పది బిల్లులను ఆమోదించినట్టే పరిగణించాలని 142 అధికరణం మేరకు ప్రకటించింది.ఈ విషయం న్యాయస్థానం సరైన రీతిలో జోక్యం చేసుకుని గవర్నర్‌ రాజ్యాంగ విరుద్ధ చర్యను చక్కదిద్దింది. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలున్న చోట్ల జోక్యం చేసుకుని ఆటంకాలు కల్పించేందుకు గవర్నర్లను పనిముట్లుగా వాడుతున్న బీజేపీకి ఇది కార్యనిర్వాహక వర్గం, పార్లమెంటు అధికారాల ధిక్కారంగా కనిపించింది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వ ప్రభుత్వం అనుసరించే ఈ నిరంకుశ ధోరణులనే ఇప్పుడు సుప్రీంకోర్టులో జయప్రదంగా సవాల్‌ చేయబడ్డాయి.వక్ఫ్‌చట్టంలో తప్పులువక్ఫ్‌ సవరణ బిల్లు Ûవిషయంలో ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా అధ్యక్షతన గల త్రిసభ్య ధర్మాసనం మొదట్లోనే ఆ చట్టంలోని కొన్ని అంశాలు, ఒక మత బృందానికి లేదా అల్ప సంఖ్యాకులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు లను ఉల్లంఘించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ‘వినియోగంలో వక్ఫ్‌’ అన్న భావనను పూర్తిగా లేకుండా చేసే తప్పు నిబంధనలను కోర్టు గమనంలోకి తీసుకుంది. ఈ చట్టం అమలుకు వచ్చేట్లయితే దీని ద్వారా ఒక్క పోటుతో వేలకు వేల వక్ఫ్‌ ఆస్తులు చెల్లకుండా పోతాయని పేర్కొంది. వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులను ఎలా నియమిస్తారని కోర్టు ప్రశ్నించింది. దేవాలయాల ట్రస్టులు బోర్డులలో ముస్లింలను నియమించవచ్చునా అని అడిగింది. వక్ఫ్‌ ఆస్తులపై వివాదాల పరిష్కారంలో కలెక్టర్ల పాత్రపై కూడా ప్రశ్నలు వేసింది.ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వు రాకుండా అడ్డుకునేందుకోసమే సొలిసిటర్‌ జనరల్‌ కోర్టు తుదినిర్ణయం చేసే వరకు కేంద్రం వినియోగంలో వక్ఫ్‌ అన్న అంశాన్ని మార్చబోదని అధికారికంగా చెప్పారు. కోర్టు తదుపరి విచారణ మే 5వ తేదీన జరగనుంది.న్యాయ వ్యవస్థకు బెదిరింపులువక్ఫ్‌ చట్టంపై కోర్టు తీసుకున్న ఈ వైఖరి కరుడుగట్టిన నిశికాంత్‌ దుబే వంటి బీజేపీ నేతలకు దురాగ్రహానికి కారణమైంది. ఉన్నత న్యాయ వ్యవస్థను బెదిరించేవిగా, ఒత్తిడి చేసేవిగా వారి వ్యాఖ్యలను చూడవలసి ఉంది. వారి మాటలను సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఖండించింది. అవి ప్రధాన న్యాయమూర్తిని అవమానించే విధంగా ఉన్నాయని పేర్కొంది. దుబేపై కోర్టు ధిక్కార చర్యల పిటిషన్‌కు అనుమతి నివ్వాలని అటార్నీ జనరల్‌ను అభ్యర్థించింది.అన్ని రాజ్యాంగ వ్యవస్థలను తన అదుపులోకి తెచ్చుకోవాలనే నిరంకుశ ప్రయాణంలో సుప్రీంకోర్టును కూడా వదిలిపెట్టడం లేదు. ఏమైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఉన్నత న్యాయవ్యవస్థను పట్టుకోలేకపోయింది. అది పూర్తిగా లోబడేలా చేసుకోలేక పోయింది.స్వతంత్రతను కాపాడుకోవాలిఇటీవలకాలంలో సుప్రీంకోర్టు కేంద్ర ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకున్న వారి హక్కులను, బెయిల్‌ మంజూరును కాపాడే విధంగా తీర్పులు వెలువరించింది. దీంతోపాటు రాష్ట్రాల శాసనసభల హక్కులను కాపాడే విధంగా, గవర్నర్ల అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే విధంగా వ్యవహరించింది. ముస్లింల హక్కులను కాలరాసే చర్యలతో కోర్టు ఏకీభవించలేదనే విధంగా కూడా సంకేతాలు వెలువడ్డాయి. వీటి ఫలితంగానే ఉన్నత న్యాయస్థానంపై మరోసారి దాడి మొదలైంది. అన్ని ప్రజాస్వామ్య శక్తులు గొంతు కలిపి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ముందుకు రావాల్సిన సమయం. ఇది సుప్రీంకోర్టును వదిలిపెట్టండి అని నినదించాల్సిన సమయం.(ఏప్రిల్‌ 23 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు