మహిళలు సమాజంలో అనునిత్యం సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంటారు. జీవితంతో పోరాటం చేస్తూనే ఉంటారు. చదువు, పెండ్లి, పిల్లలు అంటూ తెలియకుండానే సమయం గడిచిపోతుంది. ఇక ఉద్యోగం చేసే వారికైతే తమ గురించి తాము పట్టించుకునేందుకు, ఆలోచించుకునేందుకు అస్సలు సమయమే ఉండదు. ఈ బీజీ ప్రయాణంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వారికి వారు కనిపించరు. తీరా ఒక వయసు వచ్చాక… ‘ఇలా చేసి ఉండాల్సింది కాదేమో’ అనే ఆలోచనలు వస్తాయి. ఇలా కొన్ని జీవిత సత్యాలు చాలా ఆలస్యంగా బోధపడతాయి. ఇలా చాలా విషయాలను మహిళలు చాలా ఆలస్యంగా గుర్తిస్తుంటారు.
జీవితంలో మహిళలు గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఆత్మవిశ్వాసమంటే ఇతరుల కంటే గొప్పగా ఉండాలనుకోవడం కాదు. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని గ్రహించడం. మరో విషయం ఏమిటంటే ఇతరుల ప్రయత్నాలు… మీ పట్ల వారికి ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తాయి. మీ ఒకరోజు సాధారణ జీవితం.. ఇంకొకరికి జీవిత కాల స్వప్నం కావొచ్చు. కాబట్టి ప్రతిరోజూ కృతజ్ఞతతో ఉండండి. కాలం ఏ గాయాన్నీ నయం చేయదు. కానీ, అంగీకారం ఆ పని చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు అంగీకరించండి. ఉదాహరణకు చూడండి… ఒక వ్యక్తి ముప్పైల్లో అడుగుపెడితే పెద్ద వారిగా పరిగణిస్తుంటారు. అదే సమయంలో ఒక వ్యక్తి ముప్పైల్లో మరణిస్తే చిన్న వయసుగా చూస్తారు. కాబట్టి, వయసు విషయంలో ఇతరుల ఒత్తిడిని దరి చేరనీయవద్దు.
అలాగే ఎప్పుడూ అన్నిటికీ సిద్ధంగా ఉండాలనుకోవడం ఒక అపోహ. ముందు పనిని మొదలుపెట్టాలి. చేస్తున్న క్రమంలో ఆటంకాలు, ఓటములు వస్తాయి. వాటిని గుర్తించాలి. అంగీకరించాలి. మెరుగుపరుచుకోవాలి. అంతే కాని ఓటమిని చూసి కుంగిపోకూడదు. ఇక్కడ గుర్తుంచుకోవల్సిం ఏమిటంటే ‘నేను ఇది చేసి ఉండాల్సింది..’ అనే పశ్చాత్తాపం కంటే ‘నేను ఇది చేశానంటే నమ్మలేకపోతున్నా..’ అనే భావనకు ప్రాధాన్యమివ్వాలి. సాధారణంగా అందరూ జీవితంలో ఎక్కువ సమయం ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే గడుపుతారు. మీకంటే వారి జీవితాలు మెరుగ్గా ఉన్నాయనే భావనతో… వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో మీరు తీసుకునే నిర్ణయాలపై కూడా ఎలాంటి వివరణలు ఇవ్వాలో సాధన చేస్తుంటారు.
అసలు మీ గురించి ఏమాత్రం ఆలోచించని వారి అనుమతి కోసం అభ్యర్థిస్తుంటారు. అయితే ఇవన్నీ దాటిన తర్వాతే మీ అనుభవం ద్వారా చాలా నేర్చుకుంటాం. అప్పుడే మీలో ఒక మార్పు వస్తుంది. అప్పుడు ఆత్మవిశ్వాసమంటే నాలుగ్గోడల మధ్య ఉత్తమంగా ఉండడం కాదన్న విషయం అర్థమవుతుంది. మీరు కూడా సొంతంగా విజయాలు సాధించగలరని తెలుసుకుంటారు.
అలా ఇతరులు నిర్దేశించిన మైలురాళ్ల కంటే… మీరు అనుకున్న సమయంలో, మీరు ఎంచుకున్న మార్గంలో పయనించడమే ఆత్మవిశ్వాసమని తెలుసుకోండి. మీ వాస్తవికత ఇతరుల సౌకర్యాన్ని అధిగమించాలి. మీ గళం వినిపించాలి. ఈ పురోగతి సాధించడం సులభమే. అయితే మీరు ఎప్పటికీ అన్నిటికీ సిద్ధంగా ఉండాలని అనుకోవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా పనిని మాత్రం మొదలుపెట్టాలి. అది పూర్తి చేసే క్రమంలో తెలియని విషయాలను గట్టిగా నేర్చుకోవాలి. ఈ క్రమంలో పురోగతిని గుర్తిస్తూ మిమ్మల్ని మీరు విశ్వసించాలి.
ఆలస్యం చేయొద్దు
- Advertisement -
- Advertisement -