Tuesday, July 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లించొద్దు

ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లించొద్దు

- Advertisement -

– గత సర్కార్‌ తప్పులను సరిదిద్దుతున్నాం : మంత్రి సీతక్క
– గిరిజన సంక్షేమంలో లోపాలు : మంత్రి అడ్లూరి
– అభివృద్ధికి పలు ఆటంకాలు : ఎమ్మెల్యేల ఆవేదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి (ఎస్టీఎస్‌డీఎఫ్‌) నిధులను దారిమళ్లించొద్దని పంచాయతీ రాజ్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. ఏ ప్రభుత్వమైనా అలా చేస్తే గిరిజనుల అభివృద్ధి ఆగిపోతుందని గుర్తు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఏడో గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశాన్ని సలహామండలి చైర్మెన్‌, సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్‌ రామచంద్రూనాయక్‌, ఎంపీలు బలరాం నాయక్‌, గోడెం నగేష్‌, ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ట్రైకార్‌ చైర్మెన్‌ బెల్లయ్య నాయక్‌, స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, గిరిజన శాఖ కార్యదర్శి శరత్‌, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు రోడ్లు, వంతెనలు అవసరమన్నారు. గతంలో అభివృద్ధి నిధులు పక్కదారి పట్టించడం వల్ల చాలామంది గర్భిణులు ప్రసవ వేదనను అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని సూచించారు. గిరిజనుల్లో చాలామందికి ఉండటానికి ఇండ్లు కూడా లేవనీ, వాటి నిర్మాణం కోసం నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలనే డిమాండ్‌ ఉందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.రాష్ట్రంలో గిరిజన సంక్షేమం అమలులో లోపాలున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. ఐదేండ్ల తర్వాత గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కానీ, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఈ సమావేశాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎస్టీల కష్టసుఖాలను చర్చించ డానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి అందరూ తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అన్నింటిని సీఎం దృష్టికి తీసుళ్తామని స్పష్టం చేశారు. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు వారికి మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేసే పనులకు బిల్లులను సకాలంలో చెల్లిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వబోమని మంత్రి హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లోని నియోజక వర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా ఉన్న అంశాలను పరిష్కరించాలని పలువురు ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. టైగర్‌ జోన్‌ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత తీవ్రంగా ఉందనీ, దీంతో వాటి నిర్మాణాలు సమస్యగా మారిందని చెప్పారు. గిరిజనులు సేద్యం చేస్తున్న భూముల్లో అటవీ అధికారులు బోర్లు వేయనీయటం లేదనీ, విద్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయటం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -