Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజాతీయ రహదారిపై డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌

జాతీయ రహదారిపై డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌

- Advertisement -

అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌, విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకు దాదాపు 5.5 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తూ… ఎనిమిది లైన్లతో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు కె.నారాయణ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, తూడి మేఘా రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుడు మాణిక్‌ రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం తన వార్షిక ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్‌ను తయారు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ట్రాఫిక్‌ రద్దీగా ఉందని, రామోజీ ఫిల్మ్‌ సిటీ దాటిన తర్వాత ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని నారాయణరెడ్డి కోరారు. తన నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మనోహర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌ దాటిన తర్వాత పనామా వద్ద ఫ్లైఓవర్‌ను మంజూరు చేయించినందుకు మంత్రికి ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కోమటిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విజయవాడకు రెండు, మూడు గంటల్లో చేరే విధంగా.. డబుల్‌డెక్కర్‌ రోడ్డును మంజూరు చేయించుకున్నామని వివరించారు.

జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి ప్రణాళిక : మంత్రి శ్రీధర్‌బాబు
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా హైదరాబాద్‌ నగరంలో రహదారులు, మౌలిక వసతుల కల్పనపై బీఆర్‌ఎస్‌ సభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, కేపీ వివేకానంద, ముఠా గోపాల్‌ తదితరులు పలు అంశాలను లేవనెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌ పాసులు, లింకు రోడ్లు, అందుకోసం ఎంత మేర నిధులు ఖర్చు చేశారో చెప్పాలంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ అవసరాలను తీర్చడానికి ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతున్నారో చెప్పాలని కోరారు.

సభ్యుల ప్రశ్నలకు శాసనసభా వ్యవహరాలు, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ… హైదరాబాద్‌లో రూ.7,032 కోట్ల అంచనా వ్యయంతో హెచ్‌-సీఐటీఐ కింద ఫ్లై ఓవర్లు, ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు, అండర్‌ పాస్‌లు, రోడ్లకు సంబంధించి మొత్తం 26 పనులను మంజూరు చేశామన్నారు. మూడో దశలోని రెండు ప్యాకేజీల కింద రూ.1,500 కోట్ల మొత్తంలో 49 లింకు రోడ్లను మంజూరు చేశామని వివరించారు. హైదరాబాద్‌ నగర పరిమితుల్లో హెచ్‌.ఎం.డీ.ఏ ద్వారా రూ.7,406 కోట్లతో మూడు ఎలివేటెడ్‌ కారిడార్లను చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు ఇందులో రూ.120 కోట్లను ఖర్చు చేశామని వెల్లడించారు. హైదరాబాద్‌ సమగ్ర ట్రాఫిక్‌ అధ్యయనంలో భాగంగా ట్రాఫిక్‌ రద్దీ ఉన్న ప్రాంతాలు, వాటి స్థాయిలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రధాన మార్గాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని గుర్తించి, గ్రేట్‌ సపరేటర్లు, ఫ్లై ఓవర్లతో కూడిన కూడళ్లను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. హెచ్‌-సిటి కింద పాదాచారుల ప్రాధాన్య మౌలిక సదుపాయాలను చేర్చడానికి జీహెచ్‌ఎంసీ ఒక మౌలిక సదుపాయాల అభివద్ధి ప్రణాళికను రూపొందించిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -