Sunday, September 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమావోయిస్టులకు డ్రోన్‌ల మరణమృదంగం

మావోయిస్టులకు డ్రోన్‌ల మరణమృదంగం

- Advertisement -

దండకారణ్యాన్ని జల్లెడపడుతున్న సాయుధ బలగాలు
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 670 మంది మృతి
నంబాల కేశవరావు సహా పలువురి అగ్రనేతల ఎన్‌కౌంటర్‌

నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టులకు పెట్టని కోట అయిన దండకారాణ్యాన్ని కేంద్ర సాయుధ బలగాలు అడుగడుగునా జల్లెడపడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 670 మంది మావోయిస్టులను హతమార్చాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, బీహార్‌ రాష్ట్రాల పరిధిలో ఉన్న దండకారణ్యంలో రెండేండ్లుగా కేంద్ర హౌం శాఖ కొనసాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌ అక్కడ మారణహౌమం సాగిస్తోంది. ముఖ్యంగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, చిమ్మచీకటిలో కూడా చూడగలిగిన నైట్‌ డ్రాగన్‌ విజువల్‌ కెమెరాలు నక్సలైట్ల ప్రతీ కదలికను పసిగట్టి, సాయుధ బలగాలను చేరవేస్తుండటంతో వారి ఆపరేషన్‌ మరింత సులువుగా మారిపోయింది. పదేండ్ల కిందట సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేకపోవటంతో అడవిలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగిస్తున్న సమయంలో ఆ బలగాలు అనేక సమయాల్లో ఎదురు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నే ప్రధాన ఆయుధంగా చేసుకుని, సాయుధ బలగాలు దండకారణ్యంలో ముందుకెళ్తున్నాయి. మావోయిస్టులకు పట్టుకొమ్ములైన దట్టమైన అడవి, పర్వతాల గుహలను కూడా శోధిస్తూ సాగిస్తున్న కూంబింగ్‌ ఆపరేషన్‌తో ఆయా శ్రేణులు విలవిల్లాడుతున్నాయి. బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాన్ని రెండు నెలల క్రితం సాయుధ బలగాలు పసిగట్టటం దీనికి పరాకాష్ట. తద్వారా 25 వేల మంది పోలీసులతో జరిపిన దాడిలో ఏకంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు నాయక శ్రేణిలోని మరో 30 మంది మావోయిస్టులు మరణించటం ఆ పార్టీకి శరాఘాతమైంది.

అదే వరసలో ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్‌, నారాయణపూర్‌, కుసుమ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్‌, జార్ఖండ్‌లోని మరికొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌ పరిసర ప్రాంతాల్లో గత ఏడాది నుంచి సాగిన ఆపరేషన్‌ కగార్‌లో దాదాపు 670 మంది మావోయిస్టులు హతమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు చేదు అనుభవాలు ఎదురైనా మొత్తానికి కేంద్ర బలగాలు, ఆయా రాష్ట్రాల యాంటీ నక్సలైట్‌ పోలీస్‌ విభాగాలదే పై చేయిగా మారింది. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్‌ దరియాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో డ్రోన్‌ ఆధారిత చిత్రాల సాయంతో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ, మరో కేంద్ర కమిటీ సభ్యుడు సుభాష్‌ బోస్‌ అలియాస్‌ ప్రమోద్‌ సహా పది మంది మావోయిస్టులు మరణించారు. మొత్తం మీద ఈ యేడాదిలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో మావోయిస్టుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను సాయుధ బలగాలు స్వాధీన పరుచుకోగా, కూంబింగ్‌ ఆపరేషన్‌ పెరగటంతో దాదాపు రెండు వేల మంది వరకు మావోయిస్టులు లొంగుబాట పట్టినట్టు కేంద్ర హౌం శాఖ వర్గాలు ప్రకటించాయి.

కాగా మావోయిస్టులు సాధారణంగా వర్షాకాలాన్ని తమ సురక్షిత కదలికలకు అనువైన మార్గంగా ఎంచుకుంటారు. అయితే ఈ వెసులుబాటును కూడా వారికి ఇవ్వకుండా ఉచ్చు బిగించాలనే లక్ష్యంతో భారీ వర్షాల్లో సైతం కూంబింగ్‌ ఆపరేషన్లను కొనసాగించాలంటూ కేంద్ర హౌం శాఖ సాయుధ బలగాలను ఆదేశించింది. ఈ మేరకు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్న వందలాది బలగాలు మావోయిస్టులను దండకారణ్యంలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా నంబాల కేశవరావు స్థానంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన తిప్పిరి తిరుపతికి ఉన్న గెరిల్లా యుద్ధ నైపుణ్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్ర హౌం శాఖ, ఇంటిలిజెన్స్‌ వర్గాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ అతడి వ్యూహాలను అమలు కానీయకుండా, అత్యంత జాగరూకతతో ఆపరేషన్‌ను సాగించాలని తాజాగా ఆదేశాలిచ్చాయి. చర్చలకు తాము సిద్ధమనీ, అందుకు తమకు అవకాశమివ్వాలంటూ మావోయిస్టులు కోరినప్పటికీ, దాన్ని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా నిష్కర్షగా తిరస్కరించారు. పైగా వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులనే పదమే లేకుండా చేస్తామంటూ రెండ్రోజుల క్రితం పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో సాగుతున్న పోరు మరింత భీకరంగా మారే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -