Thursday, May 22, 2025
Homeఖమ్మండ్వాక్రా రుణాలలో టోకరా..!

డ్వాక్రా రుణాలలో టోకరా..!

- Advertisement -

మూడు బ్యాంకుల్లో రూ. 2 కోట్లు స్వాహా
బ్యాంకు నుంచి సభ్యులకు నోటీసులు
మూడు సంఘాల్లో 30 మంది మహిళలను దగా
రీసోర్స్ పర్సన్ నిర్వాకంతో బాధితుల గగ్గోలు
మంత్రులు, కలెక్టర్, సీపీ లను ఆశ్రయించేందుకు సన్నాహాలు
మెప్మా ఆయా బ్యాంకు అధికారుల ప్రమేయంపై ఆరోపణలు
బాధితులకు అండగా సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

‘కంచే చేను మేసిన చందం’గా డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీ) వ్యవహారం ఉంది. గ్రూపుల పనితీరును మెరుగుపరుస్తూ… రికార్డుల నిర్వహణ పనులను చూడాల్సిన ఆర్పీలు అవినీతికి ఆలవాలంగా మారుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), బ్యాంకర్లతో చేతులు కలిపి డ్వాక్రా రుణాలను సభ్యులకు తెలియకుండా స్వాహా చేస్తున్నారు. గ్రూపులను నిర్ణీత సమయంలో తనిఖీ చేయడం, ఆడిట్ తో పాటు సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆర్పీలు ఆ పనుల కన్నా పర్సంటేజీలు, రుణాల స్వాహాపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్వయం సహాయక గ్రూపుల నిర్వహణలో అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నా… సభ్యులకు తెలియకుండా రుణ సొమ్ములను ఆర్పీలు కాజేస్తున్నా సంబంధిత అధికారులు పట్టనట్టే ఉంటున్నారు. డ్వాక్రా గ్రూపులోని పొదుపు సొమ్ములతో పాటు ఉపాధి కోసం తీసుకున్న రుణాలను సైతం ఆర్పీలు, సంఘాల అధ్యక్షులు కాజేస్తున్నారు. సభ్యులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో రుణాలను మింగేస్తున్నారు. వాయిదాలు చెల్లించేందుకు సభ్యులిచ్చిన డబ్బులను సైతం నొక్కేస్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చేంత వరకు సభ్యులకు ఎంత రుణం తీసుకున్నారో… ఎంత చెల్లించాలో తెలియటం లేదు. తాము తీసుకున్న రుణానికి పది రెట్లు అధికంగా తీసుకున్నట్టు బ్యాంకుల నుంచి నోటీసులు అందుతుండటంతో సభ్యులు అవాక్కవుతున్నారు. రూ. 20వేలు తీసుకుంటే దాని పక్కన సున్నా చేర్చి రూ.2 లక్షలు తీసుకున్నట్టుగా ఆర్పీలు, బ్యాంకర్లు ఏకమై సభ్యులను నిండా ముంచుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఖమ్మం జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. బాధితులు తమకు జరిగిన అన్యాయంపై సీపీఐ (ఎం) నేతలతో పాటు ‘నవతెలంగాణ’ను ఆశ్రయించారు.

anitha

ఆర్పీ అక్రమం…రూ.2 కోట్లు స్వాహా..!
ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ ఆర్పీగా 2021-22 సంవత్సరంలో పుల్లఖండం అనిత పనిచేస్తోంది. ఆ సమయంలో శ్రీ వినాయక ఎస్ హెచ్ జీ గ్రూప్ లోని పది మందికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోటరీనగర్ శాఖ నుంచి రూ.40 లక్షల లోన్లు ఇప్పించారు. ఈ గ్రూప్ అధ్యక్షురాలిగా ఉన్న కొత్తపల్లి రాణికి ఆర్పీ అనిత చిన్ననాటి నుంచి స్నేహితురాలు కావడంతో ఆమెను పూర్తిగా నమ్మారు. రాణి ద్వారా పది మంది సభ్యులను ఓ గ్రూపుగా అనిత ఏర్పాటు చేశారు. ఒక గ్రూప్ లోని సభ్యులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారైతేనే ఆ స్వయం సహాయక సంఘం చెల్లుబాటు అవుతుంది. కానీ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో ఏర్పడిన ఈ గ్రూప్ ను మెప్మా అధికారులు ఎలా ఆమోదించారో… బ్యాంకర్లు లోన్ ఎలా ఇచ్చారనేది సందేహాస్పదంగా మారింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెళ్లయితేనే రుణాలివ్వాలనే నిబంధన ఉన్నా ఈ గ్రూప్ లోని కొత్తపల్లి ప్రియకు ఎలా లోన్ ఇచ్చారనేది కూడా అనుమానాలకు తావిస్తోంది. అదే ఏడాది వైరారోడ్ లోని సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.1.30 కోట్లు, హెచ్డీఎఫ్సీ, ఖమ్మం బ్రాంచీ నుంచి రూ.30 లక్షల రుణాలను కూడా మంజూరు చేశారు. మొత్తంగా రూ.2 కోట్ల రుణాలు వివిధ బ్యాంకుల నుంచి ఈ గ్రూప్ కు మంజూరు కాగా ఆర్పీ దీనిలో ఒక్కో సభ్యురాలికి రూ.5వేల చొప్పున గరిష్టంగా రూ.20వేల వరకు ఇచ్చారు. మిగిలిన మొత్తం సొమ్ము కూడా ఈ సభ్యుల ఖాతాలోనే జమ కాగా వాటిని తెలివిగా ఆర్పీ డ్రా చేయించి తీసుకున్నారు. కొంత సొమ్మును బ్యాంకర్లతో కుమ్మక్కై తమ సంతకాలను ఫోర్జరీ చేసి కాజేసిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. 2022 నుంచి ఈ వివాదం నడుస్తుండటంతో సభ్యులు మెప్మా అధికారులను ఆశ్రయించారు. సభ్యుల ఖాతాలో జమైన డబ్బులకు మెంబర్సే బాధ్యత వహించాలని మెప్మా అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆర్పీ విధుల నుంచి అనితను సస్పెండ్ చేశారు. అంతకుమించి ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకో లేదు. ‘రెక్కాడితే గానీ డొక్కాడని’ ఈ నిరుపేద కూలీలపై బ్యాంకు అధికారుల ఒత్తిడి ఇటీవల తీవ్రమైంది. ఈ పరిణామంతో సభ్యుల కుటుంబాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. భార్యాభర్తలు ఈ లోన్ల విషయమై తగువులాట మొదలు తన్నుకోవడం వరకు పరిస్థితులు వచ్చాయి. ఇక దిక్కులేని స్థితిలో ఈ మహిళలంతా శామ్రిక మహిళా నాయకురాలు పిన్నింటి రమ్యతో పాటు ఖానాపురం హవేలీ సీపీఐ(ఎం) కార్యదర్శి తిరుపతిరావును ఆశ్రయించారు. అంతా ‘నవతెలంగాణ’ను సంప్రదించి గోడు వెళ్లబోసుకున్నారు. భార్యలు భవన నిర్మాణం, ఇతరత్ర పారిశుధ్య కూలీలుగా విధులు నిర్వహిస్తుండగా… భర్తలు ఆటోడ్రైవర్లు, కూలీలుగా పనులు చేస్తున్నారు. ఇప్పుడు వీరంతా రూ.2 కోట్లను ఎలా చెల్లించాలో తెలియని అయోమయస్థితిలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్, సీపీ, ఇతర అధికారులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.

bhagyusri

ఫోర్జరీ సంతకాలతో డ్రా చేశారు భాగ్యశ్రీ, శ్రీ వినాయక ఎన్హెచ్లో సభ్యురాలు
మాది తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు. ప్రకాశ్ నగర్ లో ఉండే మా చెల్లివాళ్ల ఇంటికి వస్తుంటాం. అలా నాకు రాణి పరిచయం అయింది. ఆమె ద్వారా ఆర్పీ అనిత లోన్ ఇప్పిస్తానంది. ఎలాంటి ప్రూప్స్, సంతకాలు మావి లేకుండా లోన్ ఇప్పించారు. ఒక ఆధార్ కార్డు మాత్రమే నాది. ఓటర్ ఐడీ కూడా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు నోటీసులు ఇంటికి వస్తున్నాయి. నేను, నా భర్త కూలీ పనులకు వెళ్లితేనే మా కుటుంబం గడుస్తుంది. అటువంటిది మేము కట్టాల్సిన అవసరం లేదని రూ.5వేల లోన్ ఇప్పించడంతో సరే అనుకున్నాం. హెచ్డీఎఫ్సీతో పాటు యూనియన్ బ్యాంకులోనూ లోన్ ఇచ్చారు. రూ.10వేలు ఇస్తామని… రూ. 5వేలు ఇచ్చారు. గ్రూప్ సభ్యులందరి డబ్బులు నా ఒక్కదాని అకౌంట్లోనే పడ్డాయని రూ.2 లక్షలు డ్రా చేయించారు. దానిలో ఐదువేలు నాకిచ్చి… మిగతా మొత్తాన్ని రాణి తీసుకెళ్లి ఆర్పీ అనితకు ఇచ్చింది. కానీ ఇప్పుడు బ్యాంకుల నుంచి రూ.2 లక్షలు చెల్లించాలని నోటీసులు వస్తుండటంతో మా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.


రూ. 20వేలని చెప్పి సంతకంపీరబోయిన శ్రావణి, బాధితురాలు

sravani

పది మందికి రూ.20వేల చొప్పున రూ.2 లక్షలు వస్తాయని అన్నారు. అందరి డబ్బులు నా అకౌంట్లోనే పడతాయని చెప్పారు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరికి చెబుతూ రూ.20వేలని చెప్పి రూ.2 లక్షలు డ్రా చేసుకున్నారు. రూ.20వేల ఓచర్ మీదనే నేను సంతకం చేశాను. మిగిలిన నా సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఫోన్ నంబర్ నాదే. ఇప్పుడు ఆధార్ కార్డు అడ్రస్ ఆధారంగా బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఏమి చేయాలో తెలియట్లేదు.


ఆర్పీ మాటలు నమ్మి మోసపోయాంరాణి, శ్రీ వినాయక గ్రూప్ అధ్యక్షురాలు

rani

ఆర్పీ అనిత చిన్ననాటి నుంచి నా స్నేహితురాలు. ఇలా చేస్తుందని అనుకోలేదు. సభ్యులందరితో పాటు నేను కూడా మోసపోయాను. మా కుటుంబసభ్యులు, బంధువులకు కూడా లోన్లు ఇప్పించాను. మేమే రూ.13 లక్షల వరకు మోసపోయాం. ఆమె అందరికి ఇచ్చినట్టే నాకు రూ.5వేలు, 10వేలు ఇచ్చింది. ఆమెను గ్రూప్ సభ్యుల దగ్గరికి రమ్మంటే రావట్లేదు. నేను హైదరాబాద్లో రెస్టారెంట్లో పనిచేస్తున్నా. నేనుగా అంత డబ్బులు ఇవ్వలేను. ఆర్పీ అనిత ఇప్పుడు మాట దాటవేస్తోంది.
మా వంతు చర్యలు తీసుకున్నాంసుజాత, టీఎంసీ, మెప్మా, ఖమ్మం
సభ్యులు స్వయంగా డ్రా చేసి ఇచ్చారు.. కాబట్టి మేము ఏమీ చేయలేం, బ్యాంకర్లు రికవరీకి సహకరించాలని మా దగ్గరకు వస్తున్నారు. సహకరించక తప్పదు కాబట్టి మా సీవోలు వెళ్తున్నారు. ఆర్పీలకు ప్రభుత్వ వేతనం ఉంటుంది కాబట్టి ఎలాంటి పర్సంటేజీలు ఇవ్వాల్సిన పనిలేదు. సభ్యులకు ఆర్పీ ఏమి చెప్పిందో… వాళ్లు ఆమెను ఎలా నమ్మారో తెలియదు. మావంతుగా ఆర్ఫీ అనితను సస్సెండ్ చేశాం. ప్రభుత్వ వేతనం నిలిపివేశాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -