ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి
మహిళల ఆర్థిక అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా వారి సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగిందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని రాయిగిరి సోమ రాధా ఫంక్షన్ హాల్ లో స్వయం సహాయక సంఘాలకు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా మహిళా సభ్యులను ఉద్దేశించి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గంలో అక్టోబర్ 2024 నుండి మార్చి, 2025 వరకు 3772 స్వయం సహాయక సంఘాలకు మహిళలకు 566.86 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందన్నారు.ఇందిరమ్మ చీరలను స్వయం సహాయక సంఘాల మహిళల కే కాకుండా, అర్హులైన మహిళలందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందు ఉంటున్నారు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ..వడ్డీకి లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు ఒక పండగ వాతావరణం లో జరుపుకుంటున్నామన్నారు. ప్రతి మహిళ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. మహిళలకు గృహజ్యోతి,, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్లు, రూ.500 కే గ్యాస్ సిలిండర్,, ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ 566.86 వడ్డీ లేని రుణాల చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, మండల మహిళా సమైక్య అధ్యక్షులు,స్వయం సహాయక మహిళా సభ్యులు పాల్గొన్నారు.



