- Advertisement -
- ప్రాణాపాయ స్థితిలో దంపతులు
– కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలింపు - నవతెలంగాణ – గంగాధర
సంతానం లేక ఒంటరిగా జీవిస్తున్న భార్యాభర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు చల్లి సొత్తు చోరీకి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో సంతానం లేక ఒంటరిగా జీవిస్తున్న గజ్జల శంకరయ్య, లక్ష్మి దంపతులకు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు చల్లి చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న భార్య, భర్తలను టార్గెట్ చేసిన దుండగులు మత్తు మందు ప్రభావంతో ఇద్దరు సృహ తప్పి పడిపోయారు. ఇదే అదునుగా భావించి ఇంట్లోకి దూరిన దుండగులు గజ్జల లక్ష్మి మెడలో ఉన్న రెండన్నర తులాల బంగారు పుస్తెల తాడు ఎత్తుకెళ్లినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామంలోని బీసీ కాలనీని ఆనుకుని ఉన్న గజ్జల శంకరయ్య నివాస గృహం పలు ఇళ్లకు దూరంగా ఉండడం, పిల్లలు లేక దంపతులు ఇద్దరే ఒంటరిగా ఉంటున్నట్టు గ్రహించిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తుంది.
గజ్జల శంకరయ్య (75), అతని భార్య లక్ష్మి (70) ఏళ్ల వయస్సు పైబడే ఉన్నారు. ఇరువురు వయస్సు మీరి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు దంపతులను గట్టిగా అదిమి పట్టుకుని మత్తు మందు తాగించారా ? లేక ఏదైన క్రిమిసంహారక మందు కలిపిన పదార్థం అందించి అఘాయిత్యానికి ఒడిగట్టారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ మత్తు మందు కలిపిన పదార్థం తిన్న, మత్తు మందుతో కూడిన గుడ్డను ముక్కు వద్ద పెట్టిన గంట, రెండు గంటల వ్యవధిలోనే తేరుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. కాని దంపతులిద్దరు 24 గంటలు గడిచినా సృహలోకి రాకపోగా.. ఇంకా ఆస్పత్రిలో అపస్మారక స్థితిలోనే ఉండడాన్ని గమనించిన వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తేగాని ఏదైన తిన్న, తాగిన విషపూరితమైన మందు ఏంటనే విషయం తెలిసే అవకాశం లేదని చెపుతున్నారు.
దంపతులకు సంతానం లేని దృష్ట్యా వైద్యానికి అవసరమైన ఖర్చులు పెట్టడానికి వారి బంధువులు ఎవరు ముందుకు రాక, సరైన వైద్యం అందే పరిస్థితి లేక కోమాలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయమై ఎస్సై వంశీకృష్ణను ప్రశ్నించగా దంపతులిద్దరిపై విష ప్రయెాగం, బంగారం చోరీకి గురైన సమాచారమే తమకు లేదని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. అయితే బుధవారం అందిన సమాచారం మేరకు గర్శకుర్తి గ్రామంలోని గజ్జల శంకరయ్య, లక్ష్మి దంపతుల ఇంటిని ఎస్సై వంశీకృష్ణ సందర్శించి జరిగిన సంఘటన తీరుపై విచారణ జరిపి ఆరా తీశారు. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్సై వంశీకృష్ణ వివరించారు.
- Advertisement -