ఎన్నికలు నిర్వహించాలి

– జాతీయ నాయకులు, ఈసీని కలుస్తాం
– జమ్మూకాశ్మీర్‌ రాజకీయ పార్టీల వెల్లడి
– మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా నివాసంలో అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) జమ్మూకాశ్మీర్‌లో గత కొన్నేండ్లుగా ఎన్నికల నిర్వహించకపోవడంపై అక్కడి రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో మోడీ సర్కారు తీరును తప్పుబట్టాయి. ఎన్నికల నిర్వహించాలనే డిమాండ్‌తో పాటు ఈ ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అక్కడి రాజకీయ పార్టీలు చర్చించాయి. ఈ మేరకు కాశ్మీర్‌లోయలోని బంతిండిలో ఉన్న జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) అధినేత డాక్టర్‌ ఫరూక్‌ అబ్దుల్లా ఇంటిలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌, పీడీపీ, సీపీఐ(ఎం)లతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు పాల్గొన్నాయి. తమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు ఆస్తి పన్ను, విద్యార్థుల నిరసనలు, జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితితో పాటు పలు అంశాలపై చర్చించినట్టు పత్రికా సమావేశంలో ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు.
సాధారణ పరిస్థితులున్నపుడు ఎన్నికలెందుకు జరగవు?
తమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకులకు వివరించాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ”జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులే ఉన్నాయనీ, జీ20 సమావేశం నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లు అంటున్నారు. మరి అలాంటపుడు ఇక్కడ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేరు?” అని ఫరూక్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. ఎన్నికలు జరపాలనే డిమాండ్‌తో జాతీయ నాయకుల మద్దతుతో తాము ఎన్నికల సంఘాన్ని కలుస్తామని తెలిపారు. 2014 నుంచి ఇక్కడ ఎన్నికలు జరగటం లేదనీ, ఒక ప్రజాస్వామిక దేశంలో ఇది ఒక వింత విషయమని ఆయన అన్నారు. ఢిల్లీలో సమావేశం తర్వాత తామంతా మళ్లీ ఇక్కడే సమావేశమవుతామనీ, రంజాన్‌ నెల తర్వాత ఇదే అఖిలపక్ష సమావేశం ఉంటుందని ఫరూక్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా ఎన్నికలు త్వరితగతిన జరుగుతాయని అన్నారు.
ఈ సమావేశానికి సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు ఎం.వై తరిగామి హాజరయ్యారు. బెదిరించి తమ మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయని తరిగామి పత్రికా సమావేశంలో అన్నారు. ఆస్తి పన్ను అయినా, మరేదైనా.. అలాంటి నిర్ణయాలు తీసుకొనే అధికారాన్ని అసెంబ్లీకే ఉండాలని చెప్పారు.

Spread the love