– జుక్కల్ మండలం పెద్దగుల్ల తండాలో ఘటన
నవతెలంగాణ-జుక్కల్
ఇనుప కూలర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి తల్లీకూతురు ప్రాణం కోల్పోయారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్దగుల్లా తండాలో శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన చౌహాన్ ప్రహ్లాద్- షంకబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ప్రహ్లాద్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంలో వేరే పట్టణానికి వెళ్లాడు. పెద్ద కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లింది. శుక్రవారం రాత్రి కొడుకు ఆరు బయట పడుకోగా, చిన్న కుమార్తె శ్రీవాని(12), షంకబాయి(36) ఇంట్లో ఇనుప కూలర్ ఆన్ చేసుకుని పడుకున్నారు. నిద్రమత్తులో శ్రీవాని ఎడమ కాలు కూలర్‌లో వేసింది. దాంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె ద్వారా పక్కనే ఉన్న తల్లికి కూడా విద్యుత్ సరఫరా అయ్యి ప్రాణం కోల్పోయింది. ఆరు బయట పడుకున్న కొడుకు ప్రతిక్ ఉదయం లేచి లోపలికెళ్లేసరికే తల్లి, చెల్లెలు విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే చుట్టుపక్కల వారికి చెప్పగా.. వారు వచ్చి వెంటనే విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. విషయం తెలుసుకున్న బిచ్కుంద సీఐ నరేష్, జుక్కల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. షంకబాయి భర్త చౌహాన్ ప్రహ్లాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను మద్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కూలర్ ద్వారా విద్యుత్ షాక్..తల్లీకూతురు మృతి
- Advertisement -
- Advertisement -