Thursday, March 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యుత్‌ సవరణ బిల్లు 2025 - ప్రజల జీవితాల్లో చీకట్లు!

విద్యుత్‌ సవరణ బిల్లు 2025 – ప్రజల జీవితాల్లో చీకట్లు!

- Advertisement -

విద్యుత్‌ సవరణ బిల్లు-2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టపరమైన మార్పు దేశ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకర దిశలో సాగుతున్నది. విద్యుత్తును ఒక ప్రజాసేవగా కాకుండా లాభాలు కోసం అమ్ముకునే వస్తువుగా మార్చే ప్రయత్నమే ఈ విద్యుత్‌ సవరణ బిల్లు అసలు ఉద్దేశ్యం. దేశ అభివృద్ధి, సంస్కరణలు, పోటీ వంటి పదాలను ముందుకు తెచ్చి ప్రచారం చేస్తున్నప్పటికీ, ఈ సవరణ బిల్లు లోతుల్లో దాగున్నది మాత్రం కార్పొరేట్‌ ప్రయోజనాల పరిరక్షణ మాత్రమే. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు ఈ బిల్లుతో ప్రత్యక్షంగా నష్టపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సవరణ బిల్లు మూడు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది. 1.ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలను బలహీన పరచటం, 2.ప్రయివేట్‌ కంపెనీలకు సంపూర్ణ ఆధిపత్యం కల్పించడం, 3)సబ్సిడీలను క్రమంగా తొలగించడం. ఈ మూడు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన అంశాలే.

విద్యుత్‌ అనేది నేటికాలంలో విలాస వస్తువు కాదు,దేశ ప్రజల జీవనాధారం, ఒక ప్రాథమిక అవసరం. ఇంటిలో దీపాలు వెలిగించుకోవడం దగ్గర్నుంచి, పిల్లల చదువు, నీటి సరఫరా, వైద్యం, ఉపాధి వరకు ప్రతి అంశం విద్యుత్‌తో ఆధారపడి ఉంది. అలాంటి కీలక రంగాన్ని కార్పొరేట్‌ చేతుల్లో పెట్టడమంటే ప్రజల జీవితాల నియంత్రణను ఆ సంస్థలకు అప్పగించినట్లే. ఇప్పటివరకు ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థలు కొంత నష్టమైనా సరే, సామాజిక బాధ్యతతో పనిచేశాయి.లాభం లేకుండా గ్రామాలకు, గిరిజన ప్రాంతాలకు, పేదల కాలనీలకు విద్యుత్‌ను అందించాయి. కానీ, ఈ విద్యుత్‌ సవరణ బిల్లు అమల్లోకి వచ్చాక ఆ బాధ్యత పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రయివేటు కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ అప్పగించినప్పుడు వాటి లక్ష్యం ప్రజాసేవ కాదు, లాభమే పరమార్థం. లాభం ఉన్న ప్రాంతాల్లోనే సరఫరా చేస్తాయి. లాభాలు రాని ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తాయి.

ఫలితంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, పేద ప్రజలు విద్యుత్‌ కొరతతో మరింత వెనుక పడతారు. విద్యుత్‌ బిల్లులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే నిత్యావసర ధరల భారంతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల కుటుంబాలపై ఇది మరింత ఆర్థిక భారాన్ని మోపి ఒత్తిడిని పెంచుతుంది.విద్యుత్‌ అనేది లగ్జరీ వస్తువుగా మారుతుంది.అధిక బిల్లులు, మీటర్‌ చార్జీలు, సర్‌చార్జీలు అదనపు పన్నులతో అవసరమగు విద్యుత్తును వాడుకోలేని పరిస్థితికి పేద ప్రజలు, రైతులు నెట్టబడతారు. నెలాఖరులో జీతం సరిపోని పరిస్థితిలో గృహవిద్యుత్తు బిల్లు సకాలంలో చెల్లించలేకపోతే ఆ కుటుంబం చీకట్లో జీవించాల్సిన దుస్థితి ఈ దేశ ప్రజలకు ఏర్పడుతుంది.

ఈ బిల్లు రైతులపై మరింత తీవ్రమైన దాడి చేస్తుంది. వ్యవసాయం ఇప్పటికే నష్టాల్లో నడుస్తోంది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగిపోయాయి. అలాంటి సమయంలో ఉచిత లేదా సబ్సిడీ విద్యుత్‌, రైతులకు ఊపిరిగా మారింది. అయితే ఈ బిల్లు,ఉచిత విద్యుత్తును ఒక భారంలాగా ప్రభుత్వాలు చూపిస్తూ, రైతు ముందుగా విద్యుత్‌ బిల్లు చెల్లించిన తర్వాత ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలనే విధానాన్ని ఈ బిల్లులో ముందుకు తెస్తున్నాయి. ఇది కాగితాల మీద సులభంగా కనిపించినా వాస్తవంలో రైతుకు తీవ్ర సమస్యగా మారుతుంది. నగదు కొరతతో బాధపడే రైతు ముందుగా బిల్లు ఎలా చెల్లిస్తాడు? ఆలస్యం జరిగితే సమయానికి సబ్సిడీలందకపోతే పరిస్థితి ఏమిటి? చివరకు ఉచిత విద్యుత్తు హక్కు క్రమంగా అంతరించిపోతుంది. ఇప్పటికే అనేక మంది రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ ధరలు పెరిగితే సాగు ఖర్చులు పెరిగి పంట ధరలు అధికమవుతాయి.

బోర్లు నడవడం, మోటార్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థలు అన్నీ ఖరీదవుతాయి.ఇది పంట ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుంది. రైతుకు గిట్టుబాటు ధర తగ్గుతుంది. అప్పులు పెరుగుతాయి. రైతులు వ్యవసాయం నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులకు నెట్టబడతారు. ఇది కేవలం రైతు సమస్య కాదు. దేశ ఆహార భద్రతకే ముప్పు. ఈ విద్యుత్‌ సవరణ బిల్లు పట్టణ దృక్పథంతో రూపొందించబడింది. గ్రామీణ ప్రాంతానికి ఇది ఒక అస్తిత్వ సంక్షోభం లాంటిది.గ్రామాల్లో విద్యుత్తు, సాగునీరు, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు,విద్యా, వైద్యం ఇవన్నీ విద్యుత్‌ పై ఆధారపడి ఉంటాయి. ప్రయివేటు సంస్థల దృష్టిలో విద్యుత్‌ సరఫరా గ్రామాల్లో లాభం తక్కువ – నష్టం ఎక్కువ. అందువల్ల గ్రామాలలో విద్యుత్‌ సరఫరాను నిర్లక్ష్యం చేస్తారు. తరచూ విద్యుత్తు సరఫరాలో కోతలు పెరుగుతాయి. మౌలిక సదుపాయాలపై పెట్టుబడి తగ్గింపు ప్రభావం వలన గ్రామాలు మరింత వెనుకపడతాయి.

పట్టణాలకు వలసలు పెరుగుతాయి. అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమలు దేశంలో ఉపాధి కల్పనలో కీలకమైనవి. చిన్న పరిశ్రమలు, ఎం.ఎస్‌.ఎం.ఇ. రంగం ప్రధాన ఖర్చుల్లో విద్యుత్‌ ఒకటి. విద్యుత్‌ సవరణ బిల్లు అమలయ్యాక విద్యుత్‌ రేట్లు పెరుగుతాయి. క్రాస్‌ సబ్సిడీ తొలగింపు వలన పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు విద్యుత్‌ తక్కువరేట్లకు లభిస్తుంది. దీనివలన చిన్న పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఎక్కువ. తద్వారా అధికంగా నిరుద్యోగం పెరుగుదల, స్థానిక ఆర్థిక వ్యవస్థల పతనమయ్యే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు. సామాజిక అస్థిరతకు దారితీసే అంశం. గనుక ఈ సవరణ బిల్లు వలన దేశ ప్రజలను అధిక ఆర్థిక భారాల్లోకి నెట్టబడుతుంది! విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న లక్షలాదిమంది కార్మికుల కుటుంబాల భవిష్యత్తుకు కూడా ఈ బిల్లుతో అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రభుత్వ విద్యుత్‌సంస్థలో ఉన్న పర్మినెంట్‌ ఉద్యోగాల సామాజిక భద్రత, పెన్షన్‌ హక్కులు, ప్రయివేటీకరణతో ప్రమాదంలో పడతాయి. కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగుతాయి.

తక్కువ జీతాలు, ఎక్కువ పనిగంటలు, బాధ్యతలులేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల పేరుతో పేద ప్రజలపై మరో కొత్త ఆర్థిక భారాన్ని మోపుతుంది. ముందుగా డబ్బు కట్టకపోతే విద్యుత్తు ఉండదు. రోజువారి కూలీ, అసంఘటిత కార్మికుడు లేక చిన్న ఉద్యోగి నెల జీతంపై ఆధారపడే పరిస్థితి ఉంటుంది. అధిక ఖర్చుల వలన తన విద్యుత్‌ బిల్లును సకాలంలో కట్టలేని పరిస్థితిలో నెల మధ్యలోనే విద్యుత్‌ను కట్‌ చేస్తారు. అప్పుడు విద్యుత్‌ హక్కుగా కాకుండా కొనుగోలు చేసే వస్తువుగా మారుతుంది. ఇది పేదల జీవితాల్లో నిరంతర భయాన్ని, చీకటిని సృష్టిస్తుంది. అలాగే ఈ బిల్లు రాష్ట్రాల హక్కులపై కూడా తీవ్రమైన దాడిచేస్తుంది. విద్యుత్‌ రంగం సమాఖ్య వ్యవస్థలో కీలకమైన అంశము,కానీ ఈ సవరణ బిల్లు ద్వారా కేంద్రానికి అధికంగా అధికారాలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. రాష్ట్రాల నిర్ణయాధికారం తగ్గిపోతుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన రాష్ట్ర నియంత్రణ కమిషన్ల స్వతంత్రత దెబ్బతింటుంది. ఇది కేవలం విధాన పరమైన సమస్య కాదు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్య.

విద్య, వైద్యం వంటి రంగాలపై కూడా ఈ విద్యుత్‌ సవరణ బిల్లు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు సేవా దృక్పథంతో కాకుండా లాభా పేక్షతో పనిచేయడం చేస్తాయి. విద్యుత్‌ ఖర్చులు పెరిగితే సేవల నాణ్యత తగ్గుతుంది. పేదలే ఎక్కువగా నష్టపోతారు. మహిళలపై కూడా ఈ విద్యుత్‌ సవరణ బిల్లు భారం ఎక్కువగా పడుతుంది. గృహ అవసరాలు, పిల్లల చదువులు , నీటి సరఫరా తది తరాలన్నీ కూడా విద్యుత్తు మీద ఆధారపడినవే! ఈ నేపథ్యంలో విద్యుత్‌ ధరల పెరుగుదల ప్రజల శ్రమను మరింత పెంచుతుంది. ప్రభుత్వం ఈ విద్యుత్‌ సవరణ బిల్లును గ్రీన్‌ ఎనర్జీ, ఆధునీకీకరణ పేరుతో సమర్థించుకున్నా, లాభమే లక్ష్యంగా పనిచేసే ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థలు నిజంగా పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉంటాయా? చౌకగా లభించే కాలుష్య ఇంధనాల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టే ఈ విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌లో చర్చ లేకుండా రాష్ట్రాల అభిప్రాయాలు పట్టించుకోకుండా, ప్రజలతో సంప్రదింపు లేకుండా తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నించింది. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధము. అందుకే రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు ఈ బిల్లుకు పూర్తి వ్యతిరేకంగా నిలుస్తున్నాయి, పోరాడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు దేశ భవిష్యత్తు అవసరాల రీత్యా ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది.

ఎస్‌.ఎస్‌.ఆర్‌.ఎ ప్రసాద్‌
9490300867

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -