Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన

సీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన

- Advertisement -

కారుణ్య నియామకాలు, పదోన్నతులు కల్పించాలంటూ డిమాండ్ 
డి సి ఈ వైఖరి మార్చుకోవాలంటూ నినాదాలు 
త్వరలోనే నియామకాలన్నీ పూర్తి చేస్తా : సీఈ  
నవతెలంగాణ – వనపర్తి

వనపర్తి జిల్లా కేంద్రంలోని వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయం ( యూనిట్ కార్యాలయం ) ఎదుట ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ కార్మికులు గురువారం ఆందోళనకు దిగారు. కారుణ్య నియామకాలు, అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని, డి సి ఈ వైఖరిని మార్చుకోవాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిఎన్జీవో కేంద్ర కార్యదర్శి ఎన్ భీమన్న, టీఎన్జీవో వనపర్తి జిల్లా అధ్యక్షులు అశోక్, టీఎన్జీవో గద్వాల జిల్లా కార్యదర్శి బీజాపూర్ ఆనంద్, కోశాధికారి విష్ణు ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించి మాట్లాడారు. నీటి పరుదల శాఖ సీఈ కార్యాలయంలో రెండు మూడేళ్లుగా కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా, ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్ మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలకు సంబంధించిన యూనిట్లలోనూ కారుణ్య నియామకాలు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు.

కానీ వనపర్తి గద్వాల జిల్లాలకు చెందిన యూనిట్ కార్యాలయంలో డిసిఈ వెంకటరెడ్డి నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ పనులు జరగడం లేదని, ఫైల్ ముందరికి వెళ్ళనీయడం లేదని ఘాటుగా విమర్శించారు. పదోన్నతులు కారుణ్య నియామకాల విషయమై యూనియన్ నాయకులు ఎవరైనా యూనిట్ కార్యాలయానికి వస్తే ఇష్టానుసారంగా, అసభ్యకరంగా పై స్థాయిలో ఉండి అధికారులు మాట్లాడుతున్నారని తోటి ఉద్యోగులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల కాలం నుంచి ఉద్యోగులు చనిపోతే ఆ కుటుంబంలోని వ్యక్తులకు కారుణ్య నియామకం కింద ఇవ్వాల్సిన ఉద్యోగాలను ఇవ్వకుండా పెండింగ్లోనే పెడుతున్నారని తెలిపారు. మూడేళ్ల నుంచి కారుణ్య నియామకాలు చేపట్టక పోవడమే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. 98 జీవో ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని పదేపదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడంలేదని చెప్పారు. సీఈ, డిసి ఈల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగుల ప్రమోషన్లు నిలిచిపోయాయని అన్నారు.

చనిపోయిన వారి కుటుంబాల లో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు దినసరి కూలీలుగా వెళ్లి పనిచేస్తూ పిల్లలను పోషించలేని స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయానికి వస్తే ఉద్యోగుల సమస్యలపై మాట్లాడిన కిందిస్థాయి ఉద్యోగులను వేధింపులకు గురి చేయడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 యూనిట్లలో సమస్యలకు నిలయంగా మారింది కేవలం ఈ ఒక్క యూనిటీ అని పేర్కొన్నారు. తన భర్త చనిపోయిన ఒక మహిళ దాదాపు రెండేళ్లుగా కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కార్యాలయం చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతున్న పై స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. దాదాపు రెండు మూడు నెలలుగా డి సి ఈ కార్యాలయం బెంచ్ పై ఫైళ్లను పెట్టినప్పటికీ సాకులు చూపుతూ 10 నిమిషాల్లో పెట్టాల్సిన సంతకాలను పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

మిగతా యూనిట్లలో ఉద్యోగులు ఎవరైనా రిటైర్మెంట్ అయితే అదే రోజు అర్హులకు పదోన్నతులు కల్పించిన సందర్భాలు ఉన్నాయని, అవసరమైతే వాటి ప్రొసీడింగ్స్ కూడా తెప్పించి అధికారులకు చూయిస్తామని వాగ్నివాదానికి దిగారు. హైదరాబాదులో ఉన్న కార్యాలయాన్ని వనపర్తి యూనిట్ కార్యాలయానికి అనుసంధానం చేయాలని, వర్క్ డివిజన్ చేసి పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వనపర్తి యూనిట్ పరిధిలో 15 నుంచి 20 మందికి కారుణ్య నియామకాలు చేపట్టాల్సి ఉందని తెలిపారు. అలాగే జీవో నెంబర్ 98 ప్రకారం దాదాపు 50 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న లిస్టుల ప్రకారమే దాదాపు 20 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సి ఉందన్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలన్నారు. ఉద్యోగ నియామకాలతో పాటు పదోన్నతులు కల్పించకపోతే కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు మూడేళ్లుగా  కారుణ్య నియామకానికి అర్హత ఉండి కేటాయించని వారికి పాత తేదీల ప్రకారమే వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని, తద్వారా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తా : – సీఈ నాగేందర్ 
నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయానికి రెగ్యులర్ సీఈ లేకపోవడం కారణంగా కారుణ్య నియామకాలు పదోన్నతులు ఆగిపోయిన విషయం తనకు తెలియదని ఈసీ నాగేందర్ తెలిపారు. త్వరలోనే కారుణ్య నియామకాలన్నీ చేపట్టి సమస్యలన్నీ పరిష్కరిస్తానని సీఈ నాగేందర్  ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్క్ చార్టెడ్ ఎంప్లాయిస్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డి కృష్ణయ్య, నీటిపారుదల శాఖ పరిధిలోని వనపర్తి, గద్వాల జిల్లాల ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -