Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

– ముగ్గురు మావోయిస్టులు మృతి
– నిషేధిత జేజేఎంపీ సభ్యులుగా గుర్తింపు
– ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
రాంచీ : జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అనంతరం ఘటనా స్థలం నుంచి పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని నిషేధిత జార్ఖండ్‌ జన ముక్తి పరిషత్‌ (జేజేఎంపీ)కి చెందినవారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెలలో జార్ఖండ్‌లో ఇది రెండో ఎన్‌కౌంటర్‌ కావటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌ జాగ్వార్‌, గుమ్లా పోలీసులు సంయుక్తంగా కూంబింగ్‌ ఆపరేషన్‌ను జరిపాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. బిష్ణుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కెచ్‌కీ గ్రామం దగ్గరలోని అటవీ ప్రాంతంలో ఉదయం 8 గంటలకు ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. ఈ కాల్పుల్లోనే ముగ్గురు జేజేఎంపీ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మృతి చెందినవారిలో ఒకరిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్పాయి. చనిపోయిన మావోయిస్టులను లోహర్‌డగా జిల్లాకు చెందిన లాలూ లోహ్రా, సుజిత్‌ ఒరౌన్‌, లాతేహార్‌కు చెందిన చోటూ ఒరౌన్‌లుగా గుర్తించినట్టు గుమ్లా జిల్లా ఎస్పీ హరిస్‌ బిన్‌ జమాన్‌ చెప్పారు.

జార్ఖండ్‌లోని హజారీబాఫ్‌ు జిల్లాలో ఈనెల ప్రారంభంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు అగ్రశ్రేణి మావోయిస్టులు మృతి చెందిన విషయం విదితమే. ఇందులో కేంద్ర కమిటీ సభ్యులు సహదేవ్‌ సొరెన్‌పై రూ.1 కోటి, స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్‌ హెంబ్రామ్‌పై రూ.25 లక్షలు, కమిటీ సభ్యులు వీర్‌సేన్‌ గంఝూపై రూ.25 లక్షల రివార్డు ఉన్నది. ఈ ఏడాది జార్ఖండ్‌లో ఇప్పటి వరకు మొత్తం 32 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేసినట్టు జార్ఖండ్‌ పోలీసులు తెలిపారు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేయటమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రచించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే ఆపరేషన్‌ కగార్‌ పేరుతో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్లు జరుపుతోన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోవటం, మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -