ఆరుగురు మావోయిస్టులు మృతి
వీరిలో అగ్రనేత గణేశ్ ఉయికే కూడా..!
ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా
ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం
భువనేశ్వర్ : ఒడిశాలోని అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. కంధమాల్ జిల్లాలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నది. భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సంస్థకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా ఆపరేషన్స్ హెద్ గణేశ్ ఉయికే (69)తో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. మంగళవారం నుంచి కొనసాగుతున్న ఎదురు కాల్పులతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరిందని అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై స్పందించిన కేంద్ర హౌం మంత్రి అమిత్ షా.. ‘మావోయిస్టు రహిత భారత్’ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ”ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన ప్రధాన ఆపరేషన్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్ ఉయికే సహా ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు మరణించారు” అని ఆయన పేర్కొన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గల కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మరణించగా.. వారిలో కీలక నేత గణేశ్ ఉయికే కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు కోటగడ్‌లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు గాలింపు చర్యలు చేపట్టిందని పోలీసులు చెప్పారు. మొత్తం 23 టీమ్‌లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయనీ, అందులో 20 స్పెషల్ ఆపరేషన్ టీమ్స్, రెండు సీఆర్పీఎఫ్ బృందాలు, ఒక బీఎస్‌ఎఫ్ టీమ్ ఉన్నాయని వివరించారు. మృతుల్లో గణేశ్ ఉయికేతో పాటు రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యులు బారి ఎలియాస్ రాకేశ్, మరో మావోయిస్టు అమృత్‌గా గుర్తించారు. మిగతా ఇద్దరిని గుర్తించాల్సి ఉన్నదని చెప్పారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
గణేశ్ స్వస్థలం నల్లగొండ
గణేశ్‌ది తెలంగాణలోని నల్లగొండ చంద్రూర్ మండలంలోని పుల్లెంల గ్రామం. నిషేధిత మావోయిస్టు పార్టీలో క్రియాశీలంగా ఉన్న కొద్ది మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో ఈయన ఒకరని అధికారులు చెప్పారు. గణేశ్ ఉయికే తలపై రూ.1.1 కోట్ల రివార్డు ఉండగా.. బారి తలపై రూ.22 లక్షలు, అమృత్ తలపై రూ.1.65 లక్షల రివార్డు ఉన్నదని వివరించారు. గత మూడేండ్లుగా గూఢచార సంస్థల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు ఈ సంస్థలో 21 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండగా.. ప్రస్తుతం వారి సంఖ్య ఐదుకంటే తక్కువకు తగ్గిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్ ఘటనపై కేంద్ర హౌంమంత్రి అమిత్ షా స్పందించారు. గురువారం నాటికి కంధమాల్ ఆపరేషన్‌లో ఆరుగురు మృతి చెందినట్టు ప్రకటించారు. 2026 గడువు నాటికి దేశంలో మావోయిస్టులను అంతం చేస్తామని పునరుద్ఘాటించిన ఆయన.. ఒడిశాను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని పేర్కొన్నారు.
మావోయిస్టులపై తుపాకీ ఎక్కుపెట్టిన మోడీ సర్కారు
కేంద్రంలోని మోడీ సర్కారు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులోభాగంగా భద్రతా బలగాలు మావోయిస్టుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటు న్నాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌ను జల్లెడ పడుతున్నాయి. ఈనెల 3, 4 తేదీలలో భద్రతా దళాలు దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో జరిపిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 18 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం విదితమే. ఇందులో డివిజనల్ కమిటీ సభ్యులు వెల్ల మొడియం కూడా ఉన్నారు. ఈ ఘటనలో భద్రతా బలగాలకు చెందిన ఐదుగురు కూడా మరణించారు. ఎన్‌కౌంటర్ అనంతరం మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను రికవరీ చేశారు.



