Wednesday, December 17, 2025
E-PAPER
Homeమానవిశక్తినిచ్చే నువ్వులు...

శక్తినిచ్చే నువ్వులు…

- Advertisement -

కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌ వంటి ముఖ్యమైన మూలకాలు పుష్కలంగా ఉన్న నువ్వులు చలికాలంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఇవి ఎదుగుతున్న పిల్లలలో బలమైన ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. అంతేకాదు.. వీటిలో ఉండే మోనో అసంతృప్త కొవ్వులు వారి మెదడు అభివృద్ధికి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులలో ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి పిల్లల్లో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి బలమైన రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తాయి. అదేవిధంగా నువ్వులలోని పోషకాలు వారికి సహజమైన శక్తిని అందిస్తూ రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి సహాయపడతాయి. అలాగే చిన్నారుల్లో జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న నువ్వులతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం…

లడ్డు
కావాల్సిన పదార్థాలు: నువ్వులు-కప్పు, కొబ్బరి పొడి – అరకప్పు, తురిమిన బెల్లం – కప్పు, యాలకుల పొడి – చిటికెడు, నెయ్యి – పావు కప్పు.
తయారీ విధానం: నువ్వులను బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించుకొని చల్లార్చుకోవాలి. కొబ్బరి పొడిని కూడా కాస్త వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నెయ్యి వేసుకొని అది కాస్త కరిగాక బెల్లం వేసుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ బెల్లం పాకంలా మారాక.. అందులో వేయించి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్‌ తీసుకొని దానికి కాస్త నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని అందులోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. అయితే మిశ్రమం ఎక్కువగా చల్లారకుండా చూసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీ అండ్‌ హెల్దీ నువ్వుల లడ్డూలు రెడీ!

పొడి
నువ్వుల పొడి కోసం: ఎండుమిర్చి – ఆరు, నువ్వులు – ఐదు చెంచాలు, మిరియాలపొడి – అరస్పూను, వెల్లుల్లి రెబ్బలు – పది .
రసం కోసం : నూనె – తగినంత, ఆవాలు – టీస్పూను, జీలకర్ర – టీస్పూను, ఎండుమిర్చి – మూద్నాలుగు, కరివేపాకు – ఒకట్రెండు రెమ్మలు, ఉల్లిగడ్డ – రెండు(చిన్నవి), టమాటాలు – నాలుగు(మీడియం సైజ్‌వి), చింతపండు రసం – కప్పు, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – కొద్దిగా, పంచదార – అర స్పూను, సన్నని కొత్తిమీర తరుగు – కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా చింతపండును కడిగి నానబెట్టుకోవాలి. అది నానేలోపు నువ్వుల పొడిని సిద్ధం చేసుకోవాలి. స్టవ్‌ మీద చిన్న కడాయిలో సన్నని మంటపై తెల్ల నువ్వులను దోరగా వేయించి చల్లార్చుకోవాలి. మిక్సీ జార్‌ తీసుకుని అందులో ఎండుమిర్చి, వేయించిన తెల్ల నువ్వులు వేసుకుని బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత అందులో మిరియాలపొడి లేదా మిరియాలు, వెల్లుల్లి రెబ్బలను వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి.

ఇప్పుడు రసంలోకి అవసరమైన ఉల్లిగడ్డను నిలువు చీలికలుగా, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు నుంచి కప్పు చిక్కని చింతపండు గుజ్జును తీసుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద పాన్‌ పెట్టి తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అందులో కట్‌ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో మెత్తగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో ముందుగా గ్రైండ్‌ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసి ఓ నిమిషం కలుపుతూ వేయించాలి. మిశ్రమంలో రసం కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. అలాగే చింతపండు రసం, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, పంచదార వేసుకుని ఒకసారి అంతా చక్కగా కలిసేలా బాగా మిక్స్‌ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 10 నుంచి 12 నిమిషాలు మరిగించుకోవాలి. చివర్లో సన్నని కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకుంటే చాలు. ఘుమఘుమలాడే ‘నువ్వుల రసం’ రెడీ!

చిక్కీ
కావాల్సిన పదార్థాలు: నువ్వులు – ఒకటిన్నర కప్పు, బెల్లం తురుము – కప్పు, నెయ్యి – ఒకట్రెండు చెంచాలు.
తయారీ విధానం: స్టవ్‌ మీద కడాయిలో తెల్ల నువ్వులను వేసి చిన్న మంటపై గరిటెతో కలుపుతూ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో బెల్లం తురుము తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి కలియతిప్పుతూ చిన్నమంటపై మరిగించుకోవాలి. బెల్లం బాగా మరిగి చిక్కగా, బంగారు రంగులో ముదురు పాకం రావాలి. చిక్కని పాకం వచ్చాక మంట తగ్గించి అందులో వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి బాగా కలపాలి. వెంటనే నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెంలోకి తీసుకుని చపాతీ కర్రతో సమంగా సర్దుకోవాలి. చల్లారక ముందే కత్తితో మీకు నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. అంతే, సూపర్‌ టేస్టీ ‘నువ్వుల పట్టీలు లేదా చిక్కీలు’ రెడీ అవుతాయి!

కారం పొడి
కావాల్సిన పదార్థాలు: తెల్ల నువ్వులు – అర కప్పు, మిర్చి – 8 నుంచి 10, బ్యాడిగి మిర్చి – 10 నుంచి 12, ఎండుకొబ్బరి ముక్కలు – పావు కప్పు, మినప్పప్పు – పావు కప్పు, శనగపప్పు – పావు కప్పు, జీలకర్ర – అర టేబుల్‌ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు – 15 నుంచి 20, బెల్లం తురుము – టేబుల్‌ స్పూను, చింతపండు – గోలి సైజంత.
తయారీ విధానం: నువ్వులు చిన్నమంటపై రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో, బ్యాడిగి ఎండుమిర్చి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాడిగి మిర్చి వల్ల కారం పొడికి మంచి రంగు, పరిమళం వస్తుంది.

తర్వాత అదే పాన్‌లో ఎండుకొబ్బరి ముక్కలు, మినప పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని, లో-ఫ్లేమ్‌లో లైట్‌ గోల్డెన్‌ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. అందులో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పప్పులు పూర్తిగా ఎర్రగా వేగేంత వరకు రోస్ట్‌ చేసుకొని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్‌ తీసుకొని వేయించుకొని పెట్టుకున్న ఎండుమిర్చి, చల్లారిన పప్పుల మిశ్రమం వేసుకొని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. అందులో వేయించి పెట్టుకున్న నువ్వులలో రెండు చెంచాలు పక్కకు తీసి మిగతా వాటిని వేసుకోవాలి. అలాగే బెల్లం, చింతపండు వేసుకొని మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చివరగా పక్కకు తీసుకున్న రెండు చెంచాల నువ్వులు అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే.. అదిరిపోయే ‘నువ్వుల కారం పొడి’ రెడీ!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -