Friday, January 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిలొంగు'బాట'లో ఐరోపా!

లొంగు’బాట’లో ఐరోపా!

- Advertisement -

ప్రజాస్వామ్యం, గణతంత్రం, మానవహక్కులు, స్వేచ్ఛ వంటి నేతిబీర కబుర్లు చెబుతున్న నేతలకు ఇప్పుడు డోనాల్డ్‌ట్రంప్‌ రూపంలో అగ్నిపరీక్ష ఎదురైంది. వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను కిడ్నాప్‌ చేసిన తీరుచూసి అగ్రరాజ్యం ఇలా కూడా చేస్తుందా? అని సామాన్యులు నమ్మలేకపోతున్నారు. గతంలో హిట్లర్‌ ప్రపంచ దురాక్రమణకు పాల్పడినతీరు, పర్యవసానాలను యావత్‌ ప్రపంచం చవిచూసింది. ఇప్పుడు ఏదో ఒకసాకుతో అమెరికా తనకు కావాల్సిన ప్రాంతాలను స్వచ్ఛందంగా అప్పగించాలి లేదా బలప్రయోగం చేయాల్సి వస్తుందని చెబుతోంది. ఇది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో తెలియదు. మదురో తదుపరి లక్ష్యం డెన్మార్క్‌లో అంతర్భాగం, స్వయం పాలిత ప్రాంతమైన గ్రీన్‌లాండ్‌ స్వాధీనం అని ప్రకటించారు. తన భద్రత అవసరాలకు సహజ సంపదలతో జర్మనీ కి మూడు రెట్లు పెద్దదైన ఆ మంచుదీవి కావాలని చెబుతున్నాడు. ‘తోటకూరనాడే నిరోధించి ఉంటే తమ బిడ్డ ఇలా ముదిరేవాడు కాదన్న’ లోకోక్తి మనకే కాదు యావత్‌ ప్రపంచానికి తెలిసిందే.

రెండోసారి అధికారం చేపట్టిన కొద్దిరోజులకే గతేడాది జనవరిలోనే గ్రీన్‌లాండ్‌ కావాలన్న వాంఛను ట్రంప్‌ ప్రకటించాడు. అప్పుడే ఇతర నాటోదేశాలు, ముఖ్యంగా ఐరోపా పెద్దలుగా ఉన్న జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌ గట్టిగా హెచ్చరించి అడ్డుకొని ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కబ్జా చేసుకొనేందుకు సిద్ధపడటాన్ని చూసి గొణగటం తప్ప వారికి నోటమాట రావటం లేదు. ‘గ్రీన్‌లాండ్‌ నాటోలో భాగం, ఆర్కిటిక్‌ ప్రాంతంలో భద్రత ఉమ్మడిగా సాధించాలి, అమెరికాతో సహా అందరికీ బాధ్యత ఉందని’ అంటూనే డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌కు సంబంధించిన అంశాలపై నిర్ణయించుకోవాల్సింది కూడా వారే అంటూ ఐరోపా యూనియన్‌ చెప్పటం అమెరికాకు దాసోహం తప్ప మరొకటి కాదు. పెద్దన్న కావాలంటున్నాడు ఇవ్వాలో లేదో మీరు మీరు తేల్చుకోండని చేతులెత్తేసినట్లే. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటే నాటో విచ్చిన్నమైనట్లే అని డెన్మార్క్‌ తన పౌరులను సంతుష్టీకరించేందుకు ఒక ప్రకటన చేసినప్పటికీ సదరు పెద్ద దేశాల వైఖరి ఎలా ఉంటుందో దాని కి ముందే తెలుసు. అందుకే కావాలంటే గ్రీన్‌లాండ్‌లో ఇప్పటికే ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాన్ని మరింత పటిష్ట పరుచుకొనేందుకు తమకు అభ్యంతరంలేదని, తాము కూడా అక్కడ నాలుగు వందల కోట్ల డాలర్లతో నౌకలు, డ్రోన్లు, విమానాలను మోహరి స్తామని ఇటీవలనే డెన్మార్క్‌ ప్రకటించిన అంశాన్ని మరచిపోరాదు.

కొరకరాని కొయ్యగా ఉన్న రష్యాను మచ్చిక చేసుకొని చైనాతో ఉన్న బంధాన్ని తెంచేందుకు అమెరికా ఎప్పటి నుంచో బిస్కెట్లు వేస్తున్నది. కావాలంటే ఉక్రెయిన్‌లో ఎంత ప్రాంతం కావాలంటే అంత తీసుకోవచ్చని చెప్పటం దానిలో భాగమే. గతంలో ఒకసారి జి8 కూటమిలో చేర్చుకొని తర్వాత బయటకు గెంటేసిన అనుభవం ఉంది. ట్రంప్‌- పుతిన్‌ ఇద్దరూ ఇసుక తక్కెడ పేడ తక్కెడ రకాలు గనుక అంత తేలికగా అమెరికాను నమ్మటం లేదు. ఉక్రెయిన్‌లో రష్యాను అడ్డుకొనే స్థితి కనుచూపుమేరలో కనిపించటం లేదు, ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆక్రమిస్తే మీరేం చేస్తున్నారని యూరోపియన్లు తమ దేశాల నేతలను ప్రశ్నించటం సహజం. అమెరికాను ఎదిరించలేరు, ఆధిపత్యాన్ని ఆమోదించనూ లేరు అన్నట్లుగా ఐరోపా పెద్దల పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచాన్ని పంచుకొనేందుకు ఐరోపా దేశాలే దెబ్బలాడుకున్నాయి, అమెరికా ఆలస్యంగా రంగంలోకి వచ్చింది. లాటిన్‌ అమెరికా దేశాలు ఐరోపా ముఖ్యంగా స్పెయిన్‌, బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత తిరిగి అవి వాటి మీద పెత్తనం చేయకుండా తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు ఆ దేశాల్లో మరోసారి ఐరోపా జోక్యం చేసుకోకూడదంటూ దుష్టాలోచనతో ముందుకు తెచ్చిందే అమెరికా మన్రో సిద్ధాంతం. దానికనుగుణంగానే తరువాత కాలంలో తన పెరటితోటగా మార్చుకుంది.

అక్కడ వామపక్ష శక్తుల ప్రభావం పెరుగుతుండటంతో తిరిగి తన పట్టునిలుపు కొనేందుకు అమెరికా ఆటవిక న్యాయానికి దిగింది. దాన్నే డోన్రో (డోనాల్డ్‌ ట్రంప్‌-మన్రో) సిద్ధాంతం అంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాను నాటో పేరుతో తన కట్టడిలోకి అమెరికా తెచ్చుకుంది. పాము తనపిల్లలను తానే తింటుందన్నట్లుగా నాటో రక్షణలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొనేందుకు అమెరికా స్వయంగా పూనుకుంది. ఐరోపాలో ఉన్న సామ్రాజ్యవాద శక్తులు అమెరికాను ఒంటరిగా ఎదిరించలేకనే ఐరోపా సమాఖ్యను ముందుకు తీసుకు వచ్చాయి, ఇటీవలి కాలంలో మిత్రవైరుధ్యం తలెత్తింది. దాన్లో భాగంగా అదే ఐరోపా దేశాల మీద పన్ను విధిస్తానంటే అవి మూసుకొని కూర్చున్నాయి. అయితే ఎల్లకాలం ఇదే విధంగా ఉంటాయని అనుకోరాదు. తమ మౌలిక ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకు రాజీపడతాయి. తర్వాత లడాయికి దిగుతాయి. అది ఎప్పుడు, ఎలా అన్నది ఎవరూ చెప్పలేరు!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -