అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి…
రూ.13 లక్షల 15 వేల విలువైన సీఎం ఆర్ ఎప్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజల సంక్షేమం పట్ల అంకితభావంతో ప్రతీ అవకాశాన్ని ప్రజలు కోసమే వినియోగిస్తున్నాను అని, ఈ అవకాశాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఎంపికైన 38 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 13 లక్షల 15 వేల విలువైన చెక్కులను ఆయనే స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు అర్హులైన వారికి ప్రభుత్వం అందించే సహాయం చేరేలా ఎల్లప్పుడు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. నియోజక వర్గం వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.6 కోట్లు విలువైన సీఎం ఆర్ఎప్,అత్యవసర వైద్య సేవలు కోసం ఎల్ఓసీ లు అందించడం జరిగిందని తెలిపారు. ఆశ్రమ, గురుకులాల్లో విద్యార్ధుల నైపుణ్యాలు పెంపుదల కోసం వ్యక్తిత్వ వికాసం పెంపు కోసం మోటివేషన్ తరగతులు నిర్వహిస్తామని,ఈ నెల 14 న రక్త నిల్వ కేంద్రం ప్రారంభించడంతో పాటు రక్త సేకరణ శిబిరము ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం రక్త నిల్వ కేంద్రం కోసం కేటాయించిన గదిని,100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, మండల నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.