– వెలుగుమట్లలో ఇండ్లు కూలగొట్టి తప్పు చేసిన ప్రభుత్వం
– పేదలకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల భూములను లాక్కుంటూ రియల్ ఎస్టేట్ మాఫియాలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో, లగచర్లలో ఫార్మా విలేజ్, మహబూబ్‌నగర్ పట్టణంలో 150 మంది వికలాంగుల ఇండ్ల కూల్చివేత, రామగుండంలో దాడి, తాజాగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ముగ్గురు మంత్రులు, వారి బినామీలు వెజెల్ల సురేశ్, కిశోర్, దామోదర్‌రావు కోసమే ఇండ్లు కూల్చివేశారని విమర్శించారు. వారి రియల్ ఎస్టేట్ లాభాల కోసమే దౌర్జన్యం చేశారని అన్నారు. వెయ్యి మంది పేదలకు గూడు లేకుండా చేశారని చెప్పారు. పేదల ఇండ్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. బాధితులకు పట్టాలిస్తామని ప్రభుత్వం చెప్పిందని అన్నారు. వెలుగుమట్లలో 62 ఎకరాల భూమిని కొందరు భూదాన్ బోర్డుకు దానం చేశారనీ, 1989 వరకు ఆ బోర్దు ఆధీనంలోనే ఉందని గుర్తు చేశారు. 31 ఎకరాల పేరు మార్చి ప్రయివేటు వ్యక్తుల పేర్లు రాయించుకున్నారని చెప్పారు. మిగిలిన 31 ఎకరాలు బోర్డు పరిధిలోనే కొనసాగిందని వివరించారు. 1,895 మందికి 2014, ఏప్రిల్ రెండున నాటి ప్రభుత్వం పట్టాలిచ్చిందని అన్నారు. అందులో వెయ్యి మంది ఇండ్లు నిర్మించుకుని బతుకున్నారని వివరించారు. బీఆర్‌ఎస్ హయాంలో కబ్జాకు గురవుతుందన్న ఫిర్యాదు వస్తే పరిశీలించాలని అధికారులను ఆదేశించామని గుర్తు చేశారు. కానీ ఇండ్లు కూలగొట్టలేదన్నారు. విధ్వంసం, వినాశనం తప్ప ఇంకొకటి లేదని చెప్పారు. పట్టాలున్న భూమిలో ఇండ్లు కట్టుకుంటే భూమాఫియా దాడి చేసిందన్నారు. శాసనమండలి, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఇండ్లు కూలగొట్టిన పేదలకు న్యాయం జరిగేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. 310 మందికి మాత్రమే పట్టాలిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టాలున్నా అర్హుల పేర్లు లేకుండా రోడ్డున పడేసిందని విమర్శించారు. ఇండ్లు కూలగొట్టినందుకు సీఎం, ఆ ముగ్గురు మంత్రులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తేయాలని కోరారు. వెలుగుమట్ల ఘటనపై బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. కుటుంబానికి రూ.మూడు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీమంత్రులు పువ్వాడ అజరుకుమార్, జోగు రామన్న, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కెపి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



