మూడేండ్ల తరువాత సుప్రీంకోర్టులో రీ కౌంటింగ్
ఫిర్యాదు చేసిన అభ్యర్థి విజయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో ఈవీఎం గోల్‌మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మూడేండ్ల తరువాత దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీం కోర్టులో ఒక గ్రామానికి చెందిన ఓట్లను రీ కౌంటింగ్ చేశారు. దీంతో ఫిర్యాదు చేసిన అభ్యర్థి మూడేండ్ల తరువాత గెలుపొందారు. హర్యానాలోని పానిపట్ జిల్లాలో బువానా లఖు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందినా వెనక్కి తగ్గలేదు. తనకే విజయం దక్కుతుందనే నమ్మకంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలోనే ఈవీఎంలను తెరిచి కోర్టు లెక్కింపు చేపట్టగా, 51 ఓట్ల తేడాతో ఫిర్యాదు చేసిన అభ్యర్థి మోహిత్ మాలిక్ విజయం సాధించారు. మూడేండ్ల తరువాత అనుకూలంగా తీర్పు సాధించారు.
అసలేం జరిగిందంటే?
పానిపట్ జిల్లాలోని బువానా లఖు గ్రామంలో సర్పంచ్ పదవిపై ఎప్పటి నుంచో వివాదం ఉంది. 2022 నవంబర్ 2న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అభ్యర్థి మోహిత్ మాలిక్ విజయం సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ కౌంటింగ్ జరగ్గా, మరో అభ్యర్థి కుల్దీప్ గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపులో ఏదో పొరపాటు జరిగిందని అప్పుడే మోహిత్ అనుమానించారు. వెంటనే అధికారులతో వారించినా, లాభం లేకుండా పోయింది. బూత్ నంబర్ 69లో ఫలితాన్ని పొరపాటుగా మార్చారని మోహిత్ అన్నారు. జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా, ఎలాంటి పురగోతి లేదు. హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టును కొన్నాళ్ల క్రితం ఆశ్రయించారు. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కోర్టుకు ఈవీఎంలను తెప్పించింది. ఓట్లను మళ్లీ లెక్కించింది. అప్పుడు మోహిత్ మాలిక్ 51 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించింది. అంతేకాదు జిల్లా యంత్రాంగం రెండు రోజుల్లోపు మోహిత్‌తో సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశించింది. దీంతో అధికారులు మోహిత్ మాలిక్‌తో ప్రమాణం చేయించారు. తద్వారా ఆయన సర్పంచ్ అయ్యారు. మూడేండ్ల న్యాయపోరాటం తరువాత సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన అనుకున్నది సాధించారు. అయితే సుప్రీంకోర్టులో ఈవీఎంలను తెరిచి, ఓట్లను మళ్లీ లెక్కించడం దేశంలోనే తొలిసారి.
ప్రతిపక్షాల పోరాటానికి ఆయుధం
ఈ వ్యవహారం దేశంలో ప్రస్తుతం ఓటు చోరీ, ఈవీఎంలపై అనుమానాలపై ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటానికి ఆయుధంగా దొరికింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ ”ఓడిపోయిన అభ్యర్థి గెలిచాడు. ఆయన పదవీకాలంలో 3 సంవత్సరాలు, ఈవీఎం దయతో నకిలీ అభ్యర్థి సర్పంచ్‌గా ఉన్నారు. చండీగఢ్‌లో ఇలాంటి కేసు జరిగింది. అక్కడ బీజేపీ అభ్యర్థి మేయర్ ఎన్నికల్లో గెలవాలని నిర్ణయించగా, కోర్టు దానిని తిరస్కరించింది. ఎన్నికల కమిషన్‌తో పాటు బీజేపీ అన్ని ఆధారాలను నాశనం చేసినప్పుడు. ఆ తరువాత కోర్టులో ఏ ఆధారాలు ఇస్తారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. బీహార్ ప్రజాస్వామ్యానికి జన్మస్థలం. మీరు అప్రమత్తంగా, జాగ్రత్తగా, అవగాహనతో ఉండాలి” అని పోస్ట్ చేశారు.
హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో ఈవీఎం గోల్‌మాల్
- Advertisement -
- Advertisement -